హీరోల గురించి, ఆఫ్ ద స్క్రీన్ హీరోల వ్యవహారశైలి గురించి కామెంట్ చేయడానికి తెలుగుల దర్శక నిర్మాతలు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. కానీ, ‘ఆర్ఎక్స్100’ దర్శకుడు అజయ్ భూపతికి అటువంటి ఆలోచనలు వున్నట్టు కనిపించడం లేదు. సినిమా విడుదలకు ముందు ‘రొటీన్ సినిమాలు చూసే ప్రేక్షకులు నా సినిమా చూటడానికి రావొద్దు’ అని ఎలాగైతే బోల్డ్ స్టేట్మెంట్స్ ఇచ్చాడో… విడుదల తరవాత కూడా అటువంటి బోల్డ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. ఈసారి హీరోలను టార్గెట్ చేసి ఒక సలహా ఇచ్చాడు.
“హీరోలకు ఖాళీ లేకపోతే కథలు వినడం మానేయాలని, అంతేగానీ మా మేనేజర్ లేదా పీఏకి కథ చెప్పమని అడకూడదు. దర్శకులు, రచయితల దగ్గరకు వాళ్లను పంపకూడదు” అని అజయ్ భూపతి ఘాటుగా వ్యాఖ్యానించారు. పీఏలకు కథ వినడం ఏం తెలుసని అంటున్నాడితను. “కథ వినడం ఓ ఆర్ట్. అది మేనేజర్‌కి ఏం తెలుసు. అతను కథ విని హీరో దగ్గరకు వెళ్లి… మళ్లీ అదే కథను ఎలా చెబుతాడు? మేనేజర్లకు కథలు చెప్పడం వచ్చా?” అని అజయ్ ప్రశ్నించాడు.
తెలుగులో కొందరు హీరోలు తమకు నచ్చిన కథలు కాకుండా మేనేజర్లకు నచ్చిన కథల్లో నటిస్తున్నారనేది అజయ్ వాదన. ” హీరోల మైండ్‌సెట్ వేరు. మేనేజర్ల మైండ్‌సెట్ వేరు. ఇప్పుడు మేనేజర్ ఒక కథ వింటాడు. అతనికి, అతని మైండ్‌సెట్‌కి నచ్చితే హీరో దగ్గరకి వెళ్లి చెబుతాడు. అప్పుడు హీరో కథ వింటాడు. అంటే… ఇక్కడ మేనేజర్ల మైండ్‌సెట్‌కి నచ్చిన కథలను హీరోలు వింటున్నారు. చేస్తున్నారు. వాళ్ల మైండ్‌సెట్‌కి నచ్చినవి కాదు. దీనివల్ల మంచి కొన్ని మంచి కథలు, హీరోల మైండ్‌సెట్‌కి నచ్చే కథలు వాళ్ల దగ్గరకు వెళ్లడం లేదు. దాంతో వాళ్ళకి నష్టమే జరుగుతోంది. అందుకని, హీరోలు తమకు ఖాళీ వుంటే కథలు వినాలి. లేదంటే మానేయాలి” అని అజయ్ భూపతి వ్యాఖ్యానించాడు.