ఆర్.ఎక్స్ 100 పంట పండింది. బాక్సాఫీసు దగ్గర అనూహ్య విజయాన్ని, లాభాన్ని సాధించిన ఈ చిత్రానికి ఇప్పుడు రీమేక్ రైట్స్ రూపంలో భారీగా ముడుతున్నాయి. ఆర్.ఎక్స్ 100 కన్నడ హక్కుల్ని డి.ఎస్ రావు దక్కించుకున్నారు. దాదాపుగా కన్నడ హక్కుల కోసం రూ.40 లక్షల వరకూ ఇచ్చారని టాక్. హిందీ రేటయితే మూడు రెట్లు ఎక్కువ పలికింది. ఏకంగా రూ.1.5 కోట్లకు హిందీ రైట్స్ కొనుగోలు చేసేశారు. హౌస్‌ఫుల్ సిరీస్ తో నిర్మాతగా పేరు తెచ్చుకున్న సాజిద్ నాదియద్ వాలా ఆర్.ఎక్స్ 100 హిందీ రైట్స్‌కి దక్కించుకోవడం విశేషం. బాలీవుడ్లో వచ్చిన కిక్, జుడ్వా, హే బేబీ, 2 స్టేట్స్, హైవే, రంగూన్, భాగీ చిత్రాలకు ఈయనే నిర్మాత. ఈ చిత్రాన్ని ఓ యువ కథానాయకుడితో హిందీలో తెరకెక్కించడానికి అప్పుడే ఆయన సన్నాహాలు మొదలెట్టేశారు. నిజానికి ఆర్.ఎక్స్ 100 హిందీ రేటు ఈ స్థాయిలో పలుకుతుందని నిర్మాతలు కూడా భావించలేదు. ఇలాంటి కథలు.. హిందీలో ఇది వరకే వచ్చాయి కూడా. కానీ అనూహ్యంగా ఇంత మంచి రేటు వచ్చేసరికి నిర్మాతలు ఫుల్ ఖుష్ అవుతున్నారు. రూ.2.5 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా ఓవరాల్‌గా రూ.18 కోట్ల వరకూ రాబట్టుకుంది. ఓ చిన్న సినిమాకి ఇంత కంటే గొప్ప విజయం ఉంటుందా?