తెలుగు360.కామ్ రేటింగ్ :2.25/5
ప్రేమ కథ ఎప్పుడూ పవిత్రంగానే ఉండాలన్న రూలు లేదు. సినిమాల్లోనే అలాంటి అమలిన ప్రేమ కథలు చూసే అవకాశం దక్కుతుంటుంది. నిజానికి.. నిజాయతీగా.. ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోగలిగితే… ‘వాడుకుని వదిలేద్దాం’ అనే బాపతే ఎక్కువగా కనిపిస్తోందిప్పుడు. అది అమ్మాయైనా, అబ్బాయైనా. వినడానికి కాస్త కటువుగా అనిపించినా… మోడ్రన్ అమ్మాయిలు సైతం ‘యూజ్ అండ్ త్రో’ బాయ్ ఫ్రెండ్స్‌ని ఎక్కువగా చూసుకుంటున్నారు. అయితే ఈ పాయింట్‌ని టచ్ చేయడానికి మనవాళ్లు ధైర్యం చేయడం లేదు. అడపా దడపా ఇలాంటి కథలు వచ్చినా… అవెందుకో… ప్రేక్షకుల మనసులోకి చొరబడలేకపోయాయి. ‘ఆర్.ఎక్స్ 100’ కూడా అలాంటి పాయింట్ చుట్టూ తిరిగే కథే.
కథ
శివ (కార్తికేయ) ఓ అనాథ. డాడీ (రాంకీ) దగ్గరే పెరుగుతాడు. డాడీ కూడా రాంకీని ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటుంటాడు. వీరిద్దరూ ఊరి ప్రెసిడెంటు విశ్వనాథం (రావు రమేష్)కి నమ్మిన బంట్లు. అయితే… విశ్వనాథం పోకడ నచ్చక తనతో గొడవ పెట్టుకుంటారు. సరిగ్గా అదే సమయంలో విశ్వనాథం కూతురు ఇందు (పాయల్ రాజ్ పుట్) తో పీకల్లోతు ప్రేమలో పడిపోతాడు శివ. ఇందు కూడా శివని విచ్చలవిడిగా ప్రేమించేస్తుంది. ఇద్దరూ కలిసి హద్దులు మీరేలా చెలరేగిపోతారు. ఇదంతా విశ్వనాథం కంట పడుతుంది. దాంతో… శివని చావగొట్టి, రైలు మిల్లులో బంధించి… ఇందుకి పెళ్లి చేసేస్తాడు. ఇందు పెళ్లయ్యాక అమెరికా వెళ్లిపోతుంది. ఇందు కోసం శివ పిచ్చివాడిలా ఆ ప్రెసిడెంటు ఇంటి చుట్టూ తిరుగుతుంటాడు. ఓరోజు ఇందు అమెరికా నుంచి వస్తుంది. అప్పుడేమైంది? ఇందు, శివ మళ్లీ కలిశారా, లేదా? అనేదే కథ.
విశ్లేషణ
ఎందుకో మొదటి నుంచీ ‘ఆర్ ఎక్స్ 100’కి కాస్త పాజిటీవ్ బజ్జే నడిచింది. బైక్ మోడల్ని టైటిల్‌గా పెట్టడం కుర్రాళ్లని ఆకర్షించే అంశం. ఇక ట్రైలర్లు అంటారా… అవి హాట్ హాట్ గా సాగడంతో `అర్జున్ రెడ్డి `ఫ్లేవర్‌లో ఉండే సినిమా ఏదో వస్తోందని కాస్త హింట్ దక్కింది. నిజానికి ఆ వాసన కాస్త తగిలింది కూడా. అర్జున్ రెడ్డి చూడండి. హీరో, హీరోయిన్లు ఇద్దరూ గాఢంగా ప్రేమించుకుంటారు. ముద్దులు పెట్టుకుంటూ హద్దులు దాటేస్తారు. తీరా చూస్తే హీరోయిన్‌కి మరొకరితో పెళ్లి కుదురుతుంది. హీరో పిచ్చివాడైపోతాడు. ఆమెను తలచుకుంటూ తాగుతూ తందనాలు ఆడేస్తాడు. సరిగ్గా ఇక్కడే అదే జరిగింది. కాకపోతే… అర్జున్ రెడ్డిలో హీరో డాక్టర్. ఇక్కడ… థియేటర్ నడుపుతుంటాడు. అక్కడ హీరో హీరోయిన్లు చివరికి కలుసుకుంటారు. ఇక్కడైతే డ్రమెటిక్ స్టైల్లో విడిపోతారు. హీరో చేయాల్సిన ‘అతి’ని హీరోయిన్‌కి ఆపాదించి అజయ్ భూపతి కాస్త షాక్ ఇచ్చాడు.
సాధారణంగా అబ్బాయిలు అమ్మాయిల్ని వాడుకుని వదిలేసినట్టు చూపిస్తారు. ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. హీరో కండల్ని చూసి పడిపోయిన హీరోయిన్ ని కాస్త ఫ్రీజ్ చేసి… అక్కడే పాజ్ చేస్తే గనుక.. హీరోయిన్ మోటివేషన్ బాగా అర్థమైపోయి ఉంటుంది. అది ప్రేమమ్ కాదు, కామమ్ అని. అక్కడ వరకూ నత్త నడక సాగిన కథ, కథనాలు… హీరోయిన్ క్యారెక్టరైజేషన్లో ఇచ్చిన ట్విస్టుకు కచ్చితంగా షాక్ అవుతారు. ఈ కథ నడవడికను పూర్తిగా మార్చేసిన సందర్భం అది. ఈ కథపై, దర్శకుడిపై ఉన్న అనుమానాన్ని, అపనమ్మకాన్ని ఆయా సన్నివేశాలు తుడిచి పెట్టుకుపోయేలా చేస్తాయి. అసలు అమ్మాయిలు ఇలాక్కూడా ఉంటారా, ఇలాక్కూడా ఆలోచిస్తారా? అనేట్టు చేశాయి. చివరి 20 నిమిషాలూ కథ. కథనాలు పరుగులు పెడతాయి. పతాక సన్నివేశాలు కూడా… రియలిస్టిక్‌గా సాగాయి. అవన్నీ హృదయానికి హత్తుకునేవే. అయితే సినిమా ప్రారంభం నుంచి ప్రీ క్లైమాక్స్ వరకూ… సాగిన తీత, రాతే కాస్త ఇబ్బంది కలిగిస్తుంది. ఫస్టాఫ్ లో హీరోయిన్‌తో ముద్దు సీన్లు, రొమాన్స్ మినహాయిస్తే.. ‘కిక్’ ఇచ్చే విషయం ఏదీ ఉండదు. ఆయా సన్నివేశాల్ని కట్ చేసి ‘ముద్దులు పెట్టుకోవడం ఎలా’ అనే ఓ సిరీస్ చేయొచ్చేమో. ఈమధ్య కాలంలో తెలుగులో ఇంత ఘాటైన ముద్దు సన్నివేశాలు రాలేదు. ఈ విషయంలో ఈ సినిమా అర్జున్‌రెడ్డిని కూడా మించేసింది.
అయితే కేవలం ముద్దులు, శృంగార పరమైన సన్నివేశాలకే పరిమితమవ్వకుండా… హీరో, హీరోయిన్ల మధ్య కాస్త ఎమోషన్ టచ్‌ని చూపించగలిగితే.. ద్వితీయార్థంలో హీరోయిన్ ఎడబాట్టు తట్టుకోలేని కథానాయకుడి పరిస్థితి చూసి జాలైనా వేస్తుంది. ప్రేమకథలో ‘సెక్స్’ మినహా సెన్స్ లేకపోవడంతో… ద్వితీయార్థంలో శివ ఎడబాటు, అతని బాధ చూస్తే జాలి రాకపోగా నవ్వొస్తుంది. ‘గుండెల్లో గోదావరి’ లో తాప్సి పాత్రీకరణకు దగ్గరగా కనిపించే హీరోయిన్ క్యారెక్టరైజేషన్ మినహా కథలో పెద్ద మలుపులేం లేవు. ఇది నిజంగా జరిగిన కథ అని అజయ్ భూపతి చెప్పడంతో రియలిస్టిక్ టచ్ ఇవ్వడం కోసమే ఈ కథని ఇలా తీశాడేమో అనుకుని సరిపెట్టుకోవాలి. అయితే… అమ్మాయి పాత్రని ఇంత నెగిటీవ్ గా చూపించడం, మరీ మితిమీరిన ముద్దులు.. ఇవన్నీ కుటుంబ ప్రేక్షకులకు ఈ సినిమాని దూరం చేసేస్తాయి. యూత్ మాత్రం చూస్తే సరిపోతుందిలే అనుకుంటే.. వాళ్లకూ ఆ ముద్దులు తప్ప – ఇంకేం ఎఫెక్టీవ్‌గా అనిపించకపోవొచ్చు.
నటీనటులు
కార్తికేయ కు నటించే ఛాన్సు దొరికింది. కండలు పెంచిన దేహంతో ఆకట్టుకున్నాడు. ఫైట్లు చేయించే ఛాన్సు ఉన్నా… యాక్టింగ్ స్కిల్స్ చూపించడానికే ఆ పాత్రని వాడుకున్నాడు. కథానాయిక పాత్ర చాలా షాకింగ్ గా ఉంటుంది. అంత బోల్డ్‌గా నటించడానికీ దమ్ము కావాలి. అందరికంటే ఎక్కువ గుర్తుండే పాత్ర.. రాంకీ పోషించిన డాడీ. ఓ దశలో రాంకీనే హీరోనేమో అనిపించేలా ఉంది. రావు రమేష్ ఒకే ఒక్క సీన్లో .. చెలరేగిపోయాడు. మిగిలిన చోట్ల తాను కూడా సాధారణ నటుడిలా కనిపించాడు.
సాంకేతిక వర్గం
అజయ్ భూపతి రాసుకున్నది ఓ యదార్థ సంఘటన. కాబట్టి కథలో ట్విస్టులేం ఊహించకూడదు. క్లైమాక్స్ కోసమే ఇంత కథా రాసుకున్నాడా అనిపిస్తుంది. అయితే అక్కడి వరకూ కథ పట్టుగా సాగాల్సింది. అది మాత్రం లోపించింది. అర్జున్ రెడ్డి ఫ్లేవర్ కాస్త… తనకు ఎదురైన జీవితాల లోంచి తీసుకున్న వాస్తవాలు కొంత మేళవించి యువతరానికి నచ్చేలా ఓ సినిమా చేద్దామనుకున్నాడు. కానీ. అందులో పూర్తిగా సఫలం అవ్వలేకపోయాడు. నేపథ్య సంగీతం, కెమెరా పనితనం ఆకట్టుకుంటాయి. పాటలూ ఓకే అనిపించాయి.
తీర్పు
కొన్ని ఘాటైన సన్నివేశాలు చూపిస్తే యువతరం థియేటర్లకు వచ్చేస్తుంది అనుకోవడం పొరపాటు. అలాంటి ఘాటు కావల్సిన వాళ్లకు కావల్సినంత చిట్టి పోట్టి ఫోనుల్లోనూ, ఇంటర్నెట్లోనూ బోలెడంత దొరికేస్తుంది. అక్కడక్కడ కుర్రకారుని కిర్రెక్కించే సన్నివేశాలు, చివర్లో హృదయాన్ని మెలిపెట్టే ముగింపు… ఇవి బాగానే ఉన్నా.. వాటి మధ్య కథని, కథనాన్ని నడిపిన తీరులో మాత్రం దర్శకుడు చాలా తప్పులు చేశాడు.
* ఫినిషింగ్ టచ్: ఆర్.ఎక్స్ ’10’
తెలుగు360.కామ్ రేటింగ్ : 2.25/5