మాజీ ఇంటలిజెన్స్ ఏబీ వెంకటేశ్వరరావుకు ఎక్కడా కలసి రావడం లేదు. ఆయనకు సుప్రీంకోర్టులో మరోసారి ఎదురు దెబ్బ తలిగింది. సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ.. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై.. సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పై స్టే విధిస్తూ.. ఆయనను తక్షణం విధుల్లోకి తీసుకోవాలని గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. కానీ ప్రభుత్వం విధుల్లోకి తీసుకోలేదు. హైకోర్టు తీర్పుపై స్టే కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. తీర్పుపై స్టే ఇచ్చింది. తదుపరి ఆదేశాల వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని ప్రకటించారు.
3 వారాల్లో సమాధానం ఇవ్వాలని ఏబీ వెంకటేశ్వరరావుకు నోటీసులు జారీ చేసింది. అలాగే.. ఆయనపై దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను వెంకటేశ్వరరావుకు సమర్పించాలని ప్రభుత్వానికి సూచించింది. గత ప్రభుత్వంలో విజయవాడ పోలీస్ కమిషనర్‌గా, ఇంటలిజెన్స్ చీఫ్‌గా పని చేసిన ఏబీ వెంకటేశ్వరరావుకు కొత్త ప్రభుత్వంలో గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. చివరికి జీతం కూడా ఇవ్వలేదు. నిఘా పరికరాల కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారంటూ.. కేసు నమోదు చేసి సస్పెండ్ చేశారు.
తాను ఇంటలిజెన్స్ చీఫ్ పదవిలో ఉండగా ఎలాంటి పరికరాలు కొనలేదని ఆయన వాదిస్తున్నారు. ఆయితే ఆయన సస్పెన్షన్‌పై న్యాయపోరాటంలో మాత్రం వెనుకబడుతున్నారు. దీంతో డీజీపీ హోదాలో ఉన్న ఆయన మరికొంత కాలం ఖాళీగా ఉండక తప్పదు.