ఎప్పుడూ పాటలతో అదరగొట్టే గాన గంధర్వుడు ఈసారి మాటలతో… షాక్ ఇచ్చాడు. తెలుగు సినిమా, హీరోలపై కాస్త ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. మన స్టార్ హీరోలనే కాదు, సదరు హీరోల అభిమానుల్నీ వదల్లేదు. అందరికీ ఓ రౌండు క్లాసు పీకారు బాలు. విజయవాడ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో బాలుకి సన్మాన కార్యక్రమం చేశారు. బాలు అందుకొన్న వేల సన్మానాలలో ఇదొకటి. కాకపోతే… అక్కడ బాలు మాట్లాడిన తీరు.. ఈ కార్యక్రమానికి ఓ ప్రత్యేకత తీసుకొచ్చింది. సినీ మేధావుల, విమర్శకుల, సినీ ప్రియుల ఆవేదననే బాలు వెళ్లగక్కారు. కాకపోతే.. తనదైన స్టైల్లో.
దంగల్ లాంటి సినిమా తీసే ధైర్యం ఇప్పటి మన స్టార్ హీరోలకు ఉందా? అన్నది బాలు సూటి ప్రశ్న! దానికి జవాబేంటన్నది మనందరికీ తెలుసు. కమర్షియల్ ఛట్రంలో కొట్టుకుపోతున్న కథానాయకులు, తమ అభిమాన హీరో ఏం చేసినా వెర్రిగా చప్పట్లు కొట్టే ఫ్యాన్స్ ఉన్నంత కాలం మనకు దంగల్ లాంటి సినిమాలు రావన్నది ఒప్పుకోవాల్సిన చేదు నిజం. కమర్షియల్ సినిమాలు చేసుకోవడం, నాలుగు డబ్బులు వెనకేసుకోవడం ఏమాత్రం తప్పులేదు. కానీ.. అవే లోకం అనుకొని ఎందుకు బతకాలి? పది సినిమాలు చేస్తే…. అందులో ఒక్కటైనా తెలుగువాడు కాలర్ ఎత్తుకొనేలా చేసే సినిమా ఉందా?? డబ్బులు పోతే పోయాయి.. కనీసం మన ఖ్యాతి ప్రపంచానికి తెలిసింది అనుకొనే నిర్మాతగానీ, దర్శకుడు గానీ, హీరోలు గానీ మనకున్నారా?
చిరంజీవిలాంటి స్టార్ హీరోనే తీసుకొందాం. సినిమాల ద్వారా ఆయన ఇంకా సంపాదించాలా? ఇప్పటి వరకూ వెనకేసుకొంది చాలదా? తన సొంత నిర్మాణంలోనూ కమర్షియల్ సినిమానే ఎందుకు తీయాలనుకోవాలి? చిరు అనే కాదు.. దాదాపుగా స్టార్ హీరోలంతా తమ లెక్కల్లోనే బతుకుతున్నారు. తొలి మూడు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయి? ఎన్ని రికార్డుల్ని బద్దలు కొట్టాం? అనే గారడీలోనే ఉన్నప్పుడు హృదయం ఉన్న సినిమాలెక్కడి నుంచి వస్తాయి? ఎవరు తీస్తారు? కమర్షియల్ సినిమాలకు పెట్టుబడి పెట్టినట్టు రూ.30 కోట్లో రూ.40 కోట్లో పెట్టి కళాత్మక చిత్రాలు తీయమని ఎవ్వరూ అడగడం లేదు. కళ కోసం జీవితాల్నీ, ఆస్తుల్నీ పణంగా పెట్టాల్సిన అవసరం కూడా లేదు. కనీసం కోటి రూపాయల్లో ఓ విలువైన సినిమా తీయలేరా? సినిమా విలువెప్పుడూ డబ్బులతో కాదు. అదిచ్చే అనుభూతితో కొలవాలని మన హీరోలకు తెలియదా??
మరో వైపు అభిమానులేమైనా తక్కువ తిన్నారా?? ఆరు పాటలు – మూడు ఫైట్లూ – ఓ ఇంట్రవెల్ బ్యాంగ్ ఉంటే సరిపోతుందిలే.. అనుకొంటున్నారు. తమ హీరోల్ని ఇంకా హీరోలుగానే చూడాలనుకొంటున్నారు. అందుకే యాభై దాటిన వాళ్లు కూడా ఇంకా ధైర్యంగా డ్యూయెట్లు పాడుతున్నారు. ఇంకా పంచ్ డైలాగులు చెబుతున్నారు. బాలు చెప్పినట్టు ‘ఇలాంటి సినిమాల్ని మేం చూడం’ అని మొహం మీదే చెప్పేసే ధైర్యం ఉన్న రోజున కచ్చితంగా మనకూ దంగల్ లాంటి సినిమాలొస్తాయి. హీరోలు మారాలి.. మారాలి అనుకోవడం ఎంత సమంజసమో.. ముందు సోకాల్డ్ ఫ్యాన్స్ లో మార్పు రావడం కూడా అంతే అవసరం.