కర్నూలు జిల్లా రాజకీయాల్లో వలసల పర్వం కొనసాగుతోంది. అధికార పార్టీ టీడీపీలోకి పెద్ద ఎత్తున నాయకులు వచ్చి చేరుతున్నారు. ఆ జిల్లాలో ప్రముఖ రాజకీయ కుటుంబాలు ఇప్పుడు టీడీపీలోకి వచ్చాయి. కోట్ల కుటుంబం, గౌరు కుటుంబం ఇప్పుడు టీడీపీలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో, ఎస్పీవై రెడ్డి పరిస్థితి ఏంటనే చర్చ ఈ మధ్య జరుగుతూనే ఉంది. ఆయన టీడీపీలోనే ఉంటారా, లేదంటే వేరే పార్టీవైపు చూస్తున్నారా అంటూ రకరకాల కథనాలూ ప్రసారమయ్యాయి. గౌరు కుటుంబం టీడీపీలో చేరిన తరువాత ఆయన ఒక కీలక నిర్ణయం తీసుకుంటారన్న ప్రచారమూ సాగింది. ఈ నేపథ్యంలో ఆదివారం నాడు మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు ఎస్పీవై రెడ్డి.
నంద్యాల ఎంపీ టిక్కెట్ కచ్చితంగా తనకే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఎస్పీవై రెడ్డి. దీనిపై ఎవ్వరూ ఎలాంటి అనుమానాలూ పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు. నంద్యాల ఎంపీ టిక్కెట్ తమకు దక్కుతుందని కొంతమంది ఈ మధ్య ప్రచారం చేసుకుంటున్నారనీ, ఆ కథనాలను నమ్మాల్సిన పనిలేదని కార్యకర్తలకు చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తనకు పూర్తి నమ్మకం ఉందనీ, నంద్యా పార్లమెంటు సీటు, లేదా అసెంబ్లీ టిక్కెట్ తనకు ఇస్తానంటూ హామీ ఇచ్చారని ఈ సందర్బంగా ఎస్పీవై రెడ్డి గుర్తుచేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ… తాము పార్టీ మారబోతున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దనీ, ఎస్పీవై ఆరోగ్య పరిస్థితి మీద, నంద్యాల టిక్కెట్ మీద వినిపిస్తున్నవన్నీ పుకార్లే అని ఆయన కొట్టిపారేశారు.
నిజానికి, వైకాపా నుంచి వలసలు ప్రారంభమైందే ఎస్పీవై రెడ్డితో. గత ఎన్నికల తరువాత వైకాపా నుంచి మొట్టమొదటిసారిగా బయటకి వచ్చింది ఈయనే. అప్పట్నుంచీ టీడీపీలోనే కొనసాగుతున్నారు. అయితే, ఈ మధ్య కర్నూలు జిల్లాలో వరుస వలసలు చోటు చేసుకుంటూ ఉండటం, ముఖ్యంగా గౌరు కుటుంబం టీడీపీలోకి వస్తుండటంతో నంద్యాల ఎంపీ సీటుపై కొత్త లెక్కలుంటాయనే చర్చ జరుగుతోంది. గౌరు వెంకటరెడ్డి బావ శివానందరెడ్డి నంద్యాల పార్లమెంటు స్థానాన్ని ఆశిస్తున్నారని సమాచారం. ఒకవేళ ఆయనకే నంద్యాల సీటు ఇస్తే, పార్టీ మారేందుకు ఎస్పీవై సిద్ధపడతారనే ప్రచారం జోరుగా సాగింది. ఈ ప్రచారానికి ప్రస్తుతం కొంత తెర దిగినట్టే. వాస్తవానికి, నంద్యాల ఎంపీతోపాటు ఎమ్మెల్యే స్థానాన్ని కూడా మొదట్నుంచీ ఎస్పీవై ఆశిస్తున్నారట. కానీ, ఇప్పుడు రెంటిలో ఏదో ఒకటైనా తనకు దక్కుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక, టీడీపీ నిర్ణయమేంటో తేలాల్సి ఉంది.