రెండో సినిమాకే 250 కోట్ల బడ్జెట్ చేతిలోకి తీసుకున్నాాడు సుజిత్. అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా తీసే అవకాశం దక్కింది. అందునా…. బాహుబలి తరవాత ప్రభాస్ పిలిచి మరీ అవకాశం ఇవ్వడం అంటే మాటలా..? ఎన్ని రకాలుగా చూసినా, సుజిత్ అదృష్టవంతుడే. ప్రభాస్ కోసం ఇన్నేళ్లు ఎదురుచూసినందుకు తగిన ప్రతిఫలమే దొరికింది.
సుజిత్ కెపాసిటీపై ఎవ్వరికీ ఎలాంటి డౌట్లూ లేవు. కానీ ఇంత పెద్ద సినిమాని హ్యాండిల్ చేయగలడా? అనే అనుమానం మాత్రం అందరిలోనూ ఉంది. కానీ ట్రైలర్ చూశాక అవన్నీ పటాపంచలైపోయాయి. ప్రభాస్ చెప్పినట్టు ‘అంతర్జాతీయ స్థాయి దర్శకుడు’ అయ్యే లక్షణాలు సుజిత్ లో పుష్కలంగా కనిపిస్తున్నాయి. ‘సాహో’ ఏవరేజ్ అనిపించుకున్నా సరే, నాన్ బాహుబలి రికార్డులకు ఎసరు పెట్టేస్తారు. అందుకే సుజిత్పై అందరి కళ్లూ పడ్డాయి. హీరోలు, నిర్మాతలు సుజిత్పై కర్చీఫ్వేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. కానీ… సుజిత్ మాత్రం ఇప్పటి వరకూ ఎవ్వరి దగ్గరా అడ్వాన్సు తీసుకోలేదు. ఏ హీరోకీ మాట ఇవ్వలేదు. సినిమా అటూ ఇటూ అయితే ఫలితం ఎలా ఉంటుందో తనకు తెలుసు. సినిమా సూపర్ హిట్టయినా – జాతకాలు మారిపోతాయనీ తెలుసు. అందుకే అడ్వాన్సులకు దూరంగా ఉన్నాడు సుజిత్. ఎవరు కలిసినా ‘సాహో తరవాతే మాట్లాడదాం’ అంటున్నాడట. పైగా సుజిత్ తన తదుపరి సినిమానీ యూవీ క్రియేషన్స్‌కే చేసే అవకాశం ఉంది. అందుకే.. సుజిత్ కామ్‌గా ఉంటున్నాడు.