ఆంధ్రప్రదేశ్ సర్కార్.. బయట చేసేది ఒకటి.. కోర్టుల్లో వాదించేది ఒకటి అన్నట్లుగా పరిస్థితి మారిపోతోంది. ఇతర కేసుల సంగతేమో కానీ.. ప్రభాస్ నటించిన సాహో సినిమా విషయానికి వచ్చే సరికి.. కోర్టుల్లో దాఖలైన ఓ పిటిషన్పై.. ప్రభుత్వ వాదన మాత్రం.. చాలా మందిని ఆశ్చర్య పరిచింది. కావాల్సినంతగా రేట్లు పెంచుకుని … ఉదయం నుంచి రాత్రి వరకూ నిరాటంకంగా షోలు వేసుకుని అవకాశాన్ని ఏపీ సర్కార్.. సాహో నిర్మాతలకు కల్పించింది. ఈ మేరకు ధరల విషయం క్లారిటీ ఇవ్వకుండా ఆరు షోలు వేసుకునేందుకు అనుమతిస్తూ ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటుతో.. సాహో టిక్కెట్ రేట్లు ఆంధ్రప్రదేశ్లో అమాంతం పెరిగిపోయాయి.
ఆంధ్రప్రదేశ్ థియేటర్ యాజమాన్యాలు టిక్కెట్ రేట్లను… రెండింతలు చేశాయి. ధియేటర్ల వారీగా రూ.175, ఇంకొన్ని రూ.230కి పెంచేశారు. కొన్ని మల్టిపెక్స్లలో సోఫా టికెట్ ధర రూ.300, బాల్కనీ ధర రూ.200కి అమ్మేశారు. ఇంత దారుణమైన దోపిడీ జరుగుతున్నా… ఆంధ్రప్రదేశ్ అధికారులు మాత్రం కనీసం పట్టించుకోలేదు. దీంతో.. కొంత మంది అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తున్నారని ఏపీ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఏపీ ప్రభుత్వం దీనిపై స్పందించింది. అఫిడవిట్ దాఖలు చేసింది. సాహో సినిమా టికెట్ల రేటు పెంపునకు అనుమతించలేదు. తమకు అన్ని సినిమాలు ఒక్కటేనని, ఒక్కో సినిమాను ఒక్కోలా చూడలేమని తేల్చి చెప్పింది.
హైకోర్టుకు రేట్ల పెంపును అనుమతించలేదని చెప్పిన ఏపీ సర్కార్.. మరి ఆన్ లైన్లో కూడా.. పెరిగిన రేట్లతోనే టిక్కెట్ల బుకింగ్ చేసుకుంటూంటే.. ఎందుకు ఊరుకుంటున్నారన్న విషయం మాత్రం.. ఎవరికీ అర్థం కావడం లేదు. పెరిగిన టిక్కెట్ రేట్లతో… ప్రేక్షకుల నుంచి తొలి రోజు.. రూ. ఏడు నుంచి ఎనిమిది కోట్లు అదనంగా వసూలు చేస్తారని అంచనా. అంత సొమ్ము ప్రజల నుంచి దోపిడీ చేస్తూంటే.. ప్రభుత్వం … ఎందుకు చూస్తూ ఊరుకుంటుందో ఎవరికీ అర్థం కావడం లేదు. కోర్టుల్లో… మాత్రం.. అనుమతి లేదని వాదిస్తోంది. సాహో ఒక్క సినిమాకే.. కాదు.. దాదాపు ప్రతి భారీ సినిమాకు అదే పరిస్థితి. ఎక్కడా అధికారికంగా ప్రభుత్వాలు.. రేట్ల పెంపునకు అనుమతించవు. నోటిమాటగా పర్మిషన్ ఇస్తాయి. ఓ రకంగా ఇది ప్రేక్షకులను అనధికారికంగా దోచుకోమని చెప్పడమే..!