మిర్చి తరవాత.. ప్రభాస్ నుంచి వచ్చింది బాహుబలి మాత్రమే. ఐదేళ్లలో రెండు సినిమాలే తీసినా, తన అభిమానులంతా గర్వపడే సందర్భాలెన్నింటినో అందించాడు. 2017లో మాత్రం రెండు సినిమాలు వచ్చేలా ప్లాన్ చేశాడు ప్రభాస్. ‘బాహుబలి 2’ విడుదలై ఆరు నెలలోపు.. ‘సాహో’ నీ అభిమానులకు అందివ్వాలని ఆశించాడు. అయితే… ఇప్పుడు ఆ ప్లాన్ వర్కవుట్ కావడం లేదు. ‘సాహో’ 2018 ఏప్రిల్‌లో గానీ రావడం లేదు. దానికి గల కారణం… ‘బాహుబలి 2’నే. ‘బాహుబలి’ సిరీస్‌తో ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు. దాంతో ‘సాహో’పైనా భారీ అంచనాలు ఏర్పడడం ఖాయం. ‘బాహుబలి’ తో వచ్చిన క్రేజ్ క్యాష్ చేసుకోవడానికి ‘సాహో’ని తమిళ, హిందీ భాషల్లో విడుదల చేయాలని ‘సాహో’ బృందం ఫిక్సయ్యింది. ‘సాహో’ని ఏదో డబ్బింగ్ సినిమాలా కాకుండా, స్ట్రయిట్ సినిమాలానే విడుదల చేయాలని భావిస్తోంది. అందుకే… కొన్ని కీలకమైన సన్నివేశాల్ని తమిళం, హిందీలలో కూడా తెరకెక్కించనున్నారు.
అవసరాన్ని బట్టి తమిళంలో వేరే నటులతో, హిందీలో వేరే నటులతో సన్నివేశాల్ని రూపొందిచనున్నారు. దీనికి చాలా టైమ్ పట్టేస్తుంది. దానికి తోడు ప్రభాస్ తన లుక్‌ని పూర్తిగా మార్చుకొనే పనిలో ఉన్నాడు. కనీసం రెండు నెలల పాటు… విశ్రాంతి తీసుకొని, సరికొత్త లుక్‌తో ‘సాహో’లో కనిపించాలని భావిస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రభాస్ పెళ్లి కూడా 2017లోనే జరగబోతోంది. పెళ్లికీ కొంత సమయం కేటాయించాల్సిందే. అందుకే… వీటన్నింటి మధ్య ‘సాహో’ని హడావుడిగా పూర్తి చేయడం కంటే… తీరిగ్గానే ‘సాహో’ని విడుదల చేయాలని ప్రభాస్ భావిస్తున్నాడట. అందుకే.. 2017లో విడుదల అవ్వాల్సిన సాహో… 2018లోకి వెళ్లిపోయింది