ఆ మధ్య ”అజ్ఞాతవాసి” గురించి త్రివిక్రమ్ ని అడిగితే భలే సమాధానం చెప్పారు. ”అజ్ఞాతవాసి సెటప్ లోనే దోషం వుందండి. అది రిలీజ్ అయిన తర్వాత తెలిసింది (నవ్వుతూ). బేసిగ్గా మన ఆడియన్స్ టేస్ట్ వేరు. మనకి చందమామ లాంటి కధలే నచ్చుతాయి. బాహుబలి తీసుకోండి. ”అనగనగా ఒక రాజు. ఆ రాజుకికి ఇద్దరు కొడుకులు. ఓ యువరాణి కోసం, ఓ రాజ్యం కోసం యుద్ధం చేస్తారు” ఇదీ కధ. ఇలాంటి లైన్స్ మంచి నీళ్ళు తాగినంత ఈజీగా కనెక్ట్ అవుతాయి. అజ్ఞాతవాసి కధ కూడా అదే. లేదంటే చిన్న తేడా. ”అనగనగా ఓ అంబాని. ఆ అంబానీకి ఇద్దరు కొడుకులు’ అని చెప్పాను. బేసిగ్గా మనకి సినిమా పేజీపై ఉన్నంత ఇంట్రస్ట్ బిజినెస్ పేజీపై వుండదు. అందుకే కనెక్ట్ కాలేదు” అని నవ్వేశారాయన. ఆయన నవ్వుతూ చెప్పినా.. వాస్తవం మాత్రం అదే. సినిమాని సినిమాగానే తీయాలి. బిజినెస్ పేజీ చేయకూడదు.
ఈ మాత్రానికి కాపీ కొట్టాలా ?
ఇప్పుడు మెయిన్ పాయింట్ .. ‘సాహో’ విషయానికి వద్దాం. వాస్తవానికి అజ్ఞాతవాసి, సాహో.. ఈ రెండు కూడా కాపీ కధలు. లార్గో వించ్ అనే ఫ్రెంచ్ సినిమా నుండి లైన్ ఎత్తేశారు. ”తండ్రి చావుకి కారణమైనవారని అంతం చేయడానికి అజ్ఞాతంలో పెరుగుతున్న కొడుకు రంగంలో దిగుతాడు.” ఒక్కమాటలో ఇదే కధ.
త్రివిక్రమ్ స్వయంగా కధకుడు. మరి ఆయనకి బద్దకమో లేదా పెన్నులో ఇంక్ అయిపోయిందో ఏమిటో గానీ ఈ మాత్రం లైన్ ని కాపీ కొట్టి పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే పరమ వేస్ట్ సినిమా తీశాడు. పవన్ కళ్యాణ్ తెర మీద వుంటే సరిపోతుందనే ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమో కానీ.. లార్గో వించ్ ఆత్మని కనీసం అర్ధం చేసుకోకుండా రాసిందే రాత తీసిందే తీత అన్నట్టుగా సినిమాని అజ్ఞాతంలో కలిపేశాడు. ఇది చాలదన్నట్లు లార్గో వించ్ దర్శకుడితో అక్షింతలు కూడా వేయించుకున్నాడు. చౌర్యం నిందలు మోశాడు. అక్కడితో అది ముగిసింది.
మరి సాహో నిద్రపోయాడా??
ఇప్పుడు సాహో వచ్చింది. ఈ సినిమా హిట్టా ఫట్టా అనే పాయింట్ వద్దు. డబ్బులు వస్తున్నాయా లేదా ? అనేది కూడా మాట్లాడటం లేదు. సినిమాలో ఎంత దమ్ము వుందో సినిమా తీసిన వాళ్ళకే బాగా తెలుసు. ఒక్కటి మాత్రం చెప్పొచ్చు. సాహోని మరీ నిర్లక్ష్యంగా తీశారు. ఎంత నిర్లక్ష్యం అంటే..లార్గో వించ్ తెలుగులో అజ్నాతవాసిగా ఫ్లాఫ్ అయ్యిందని తెలిసి కూడా ఎలాంటి మార్పులు లేకుండా ఆత్మలేని శరీరం లాంటి సినిమాని వదిలారు.
అజ్నాతవాసి రిలీజ్ సమయంలోనే లార్గో వించ్ దర్శకుడు తిట్టిపోశాడు. చాలా హడావిడి జరిగింది. ప్రబాస్ కి అంటే టైం లేదనుకోవచ్చు. దర్శకుడు సుజిత్ కి ఏమైయింది. ?? లార్గో వించ్ ని సాహోగా తీస్తున్నప్పుడు కనీసం చుసుకోవద్దా?! చూసుకోలేదు సరే.. కనీసం అజ్నాతవాసి ఫ్లాఫ్ కి కారణాలు తెసుకుకోవాల్సిన అవసరం వుంది కదా. కధ లాక్ చేసుకొని సెట్ పైకి వెళ్ళిపోయిన తర్వాత కుదరదని అనుకోవడానికి లేదు. అప్పటికే ఇంక బోలెడు షూటింగ్ వుంది. ఎడిటింగ్ టేబుల్ దగ్గర కూర్చొని సినిమా తల రాతని మార్చే అవకాశం వుండనే వుంది. కానీ అవేమీ పట్టించుకోలేదు. సాహో టీం కూడా మేము తీసిందే తీత. ఇంక ప్రేక్షకుడి తలరాత అన్నట్లుగా బిహేవ్ చేసింది.
సాహో చూసిన తర్వాత ఇదే అనిపించింది. భారీ సినిమా.. హీరో ఫైట్లు చేస్తాడు. ఎంతమందినైనా ఇరగదీస్తాడు. బోర్ కొడితే అందమైన లొకేషన్ లో పాట పాడుకుంటాడు. బుల్లెట్ల వర్షం కురిసినా.. ఒక్క బుల్లెట్ కూడా తాకదు. న్యూటన్ భ్యుమ్యాకర్శన సూత్రం అతడికి వర్తించదు. డైహార్డ్ ఫ్యాన్స్.. సచ్చినట్లు చూస్తారు. ఇదీ సాహో లెక్క.
ఇలాంటి లెక్కలు ఉన్నంత కాలం సాహో లాంటి కళాఖండాలకి కొదవుండదు.