వారానికి ఒక్క రోజు మాత్రమే… అదీ ఆదివారమే సెలవు! అప్పుడే నటీనటులు, సాంకేతిక నిపుణులు ఇంటికి వెళ్లి రావాలి. మిగతా రోజులన్నీ రామోజీ ఫిల్మ్ సిటీలోనే వుండాలి. ఇదీ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘సాహో’ చిత్రీకరణ జరుగుతున్న తీరు! సాధారణంగా భాగ్య నరగంలో చిత్రీకరణలు జరిగితే… నటీనటులు, సాంకేతిక నిపుణులు ప్రతిరోజూ తమ తమ ఇళ్ల నుంచి సెట్‌కి, స్టూడియోకి వెళతారు. కానీ, ‘బాహుబలి’తో పంథా మారింది. కుటుంబ సభ్యలతో కలిసి దర్శకుడు రాజమౌళి రేయింబవళ్లు రామోజీలోనే వుండి పని చేశారు. మధ్య మధ్యలో సిటీకి వచ్చి వెళ్లేవారు. ఎందుకంటే… భారీ బడ్జెట్ సినిమా. కొన్ని సన్నివేశాల చిత్రీకరణ ఉదయం ప్రారంభిస్తే రాత్రి ఎప్పటికి పూర్తి అవుతుందో తెలియని పరిస్థితి. అందుకని, అక్కడే వుండేవారు. ‘సాహో’ చిత్రానికీ అదే పంథాని అనుసరిస్తున్నారని సమాచారం. మరో వారం రోజుల్లో ఈ సినిమా రామోజీ ఫిల్మ్ సిటీ షెడ్యూల్ పూర్తవుతుంది. జూలై ద్వితీయార్థం నుంచి రామోజీలో చేస్తున్నారు. అప్పట్నుంచి ప్రభాస్ స్టూడియోలోనే వుంటున్నార్ట! రామోజీలో రాజ వైభోగాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో సమస్త సౌకర్యాలు వుంటాయి. అందరికీ బస అక్కడే ఏర్పాటు చేశార్ట! కథానాయిక శ్రద్ధా కపూర్ మాత్రం మధ్య మధ్యలో వచ్చి వెళ్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్, మురళీ శర్మ తదితరులపై పోరాట సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.