తెలుగు360 రేటింగ్: 2
వెండి కంచంలోనో బంగారపు పళ్లెంలోనో భోజనం చేయాలని ఎవరికి ఉండదు..?
కానీ ఆ రుచి పళ్లెంతో రాదు. చేసిన పదార్థాలతో వస్తుంది.
సినిమా కూడా అంతే.
మేం ఇంత ఖర్చు పెట్టాం, అంత ఖర్చు పెట్టాం, ఇన్నేళ్లు కష్టపడి తీశాం – అని చెప్పుకోవడం అనవసరం.
అది ప్రేక్షకుడికి నచ్చేలా తయారైందా? ఆ విందు భోజనం రుచించిందా? అనేదే ప్రధానం
బాహుబలి ఆడిందంటే.. రాజమౌళి కష్టపడినందుకు కాదు, ప్రభాస్ కండలు పెంచినందుకూ కాదు.
అందులో ఎమోషన్ వర్కవుట్ అయ్యింది. కథేమీ నేల విడచి సాము చేయలేదు. మహా భారతంలోని పాత్రల్ని దాటి పోలేదా సినిమా.
ఆ సినిమాని చూసుకుని బడ్జెట్లు పెంచుకోవడం అలవాటు చేసుకుంది తెలుగు పరిశ్రమ. ఆ అంకెలు చూసి తెలుగు సినిమా మార్కెట్ పెరిగిపోతోందని చంకలు గుద్దేసుకుంటున్నారు జనాలు. కానీ తీతలో తేడా వస్తే ఏం జరుగుతుందో.. ఆ ప్రభావం ఎంత ఉంటుందో చాలా సినిమాలు చాటి చెప్పాయి. ఆ జాబితాలో ఇక మీదట సాహో డైరెక్టుగా ఒకటో నెంబరులో తిష్ట వేసుకుని కూర్చుంటుంది!
సాహో కథేమిటన్నది ట్రైలర్లు, టీజర్లు, ఈమధ్య వచ్చిన ఫీలర్లని బట్టి అర్థమైపోతుంది. అయినా టూకీగా చెప్పుకోవాలంటే… ఓ ఘరానా దొంగని పట్టుకోవడానికి అండర్ కవర్ పోలీస్ (ప్రభాస్) రంగంలోకి దిగుతాడు. ఆ దొంగ చాలా తెలివిగా తప్పించుకుంటుంటాడు. ఆ దొంగని పట్టుకోవడం ముంబై పోలీసులకే సవాలుగా మారుతుంది. దానికి తోడు.. 2 వేల కోట్లకు సంబంధించిన లాకర్ తాళాలు దొంగిలించడానికి ఆ దొంగ ప్రయత్నిస్తుంటాడు. ఆ తాళాల కథేమిటి? ఆ లాకర్ సంగతేమిటి? నిజంగా దొంగెవరు, దొర ఎవరు? వీటికీ వేల కోట్ల మాఫియా సామ్రాజ్యానికీ ఉన్న సంబంధం ఏమిటి అనేదే సాహో కథ.
కథగా ఏమున్నా – కథనం, దాన్ని నడిపించిన విధానం, మలుపులూ ఉంటే – సరిపోతుంది. పైగా కావల్సినంత బడ్జెట్టు దొరికింది. నచ్చిన నటీనటులు, టెక్నీషియన్లని ఎంచుకునే ఛాన్సు దక్కింది. ఏమాత్రం బలం లేని కథలోంచి ట్విస్టులు పుట్టించి, కథని రకరకాల మలుపులు తిప్పి – హిట్లు కొట్టిన సినిమాలు చాలా ఉన్నాయి. ఆ ధైర్యంతో యూవీ క్రియేషన్స్, సుజిత్ రంగంలోకి దిగిపోయారు. మంచి యాక్షన్ సినిమాకి కావల్సినంత ప్యాడింగ్ సాహోలో ఉంది. ధూమ్ తరహాలో దొంగతనాలు జరగడం, దొంగని పట్టుకోవడానికి హీరో ప్రయత్నించడం, అయినా దొంగ తప్పించుకుని తిరగడం – ఇవన్నీ ఇంట్రస్టింగ్‌గానే తీయొచ్చు. కానీ సుజిత్ ఆ పని చేయలేదు. భారీ హంగులు, స్టార్ ఆర్టిస్టులపై పెట్టిన శ్రద్ధ ఈ కథని నడిపించడంలో ఏమాత్రం పెట్టలేదు. తొలి సగంలో ఒకట్రెండు సన్నివేశాలు తప్ప.. ఏ పాయింటూ, ఏ సీనూ ప్రేక్షకుడికి కనెక్ట్ కాదు. ప్రభాస్ ఎంట్రీనే ఓ భారీ ఫైట్‌తో. ఆ ఫైట్.. వైకుంఠపాళిలా ఉంటుంది. థీమ్ బాగుంది. కానీ… ఆ ఫైట్ నేపథ్యమే చాలా సిల్లీగా అనిపిస్తుంది. ఫైట్ ఎప్పుడూ ఓ ఎమోషన్ నుంచి పుట్టుకురావాలి. లేదంటే వృథానే. అలాంటి పోరాట ఘట్టాలే ఈ సినిమా నిండా కనిపిస్తాయి. ఓ ఛేజ్ జరుగుతుంటే.. హీరో దొరక్కూడదనో, విలన్ దొరికిపోవాలనో ప్రేక్షకుడు కోరుకోవాలి. అలాంటి మూమెంట్ ఛేజింగుల్లో లేనప్పుడు దాన్ని దుబాయ్‌లో తీస్తే ఏమిటి? వంద కోట్లు ఖర్చు పెడితే ఏమిటి?
ఇంట్రవెల్ ముందు ఓ ట్విస్టు ఇచ్చారు. దాన్ని ట్విస్టూ అనకూడదేమో. ఎందుకంటే.. ఆ సంగతి థియేటర్లోకి రాకముందే ప్రేక్షకుడికి తెలిసిపోయింది. దాంతో… ఆ మలుపు ప్రేక్షకుడ్ని ఏమాత్రం కదిలించదు. ద్వితీయార్థంలో మరింత గందరగోళం. కొన్ని సన్నివేశాలు ఎందుకు తీశాడో, అసలు వాటిని దర్శకుడు హీరోకీ, నిర్మాతకీ ఎలా కన్వెన్స్ చేశాడో కూడా అర్థం కాదు. పతాక సన్నివేశాలకు చాలా ఖర్చు పెట్టారు. ఓ ఫైటు, ఆ తరవాత ఛేజింగు, మళ్లీ ఫైటూ… ఇలా డబ్బులన్నీ అక్కడే కుప్పలుగా పోశారు. ప్రతీ చిన్న పాత్రకూ పేరున్న నటుడ్ని తీసుకోవడం, హిందీ కోసం వీళ్లు, తమిళం కోసం వీళ్లు అంటూ వాటాలేసుకుని ఎంచుకోవడం వరకూ బాగుంది. కానీ… వాళ్ల కోసం సరైన పాత్రలు రాసుకోవాలి కదా? క్లైమాక్స్‌లో ట్విస్టు చల్లారిపోయిన నిప్పులో నెయ్యి పోసినట్టే. అప్పటికే ఈ సినిమా చూస్తూ చూస్తూ నీరసాలు ఆవహించిన ప్రేక్షకుడికి – ఆ ట్విస్టు వల్ల ఎలాంటి ఉత్తేజమూ రాదు.
ప్రభాస్ ఒక్కో ఫ్రేములో ఒక్కోలా కనిపించాడు. మిర్చీలో కనిపించిన ప్రభాస్, బాహుబలిలో కనిపించిన ప్రభాస్ ఇతనేనా? అనేలా ఉన్నాడు. యాక్షన్ దృశ్యాల్లో కష్టపడ్డాడేమో. మిగిలిన చోట్ల ఒళ్లు నలగడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. ప్రభాస్ నుంచి ఆశించే రొమాంటిక్ సీన్లు, కామెడీ ఇందులోనూ ఉన్నాయి. కానీ అవేం పండలేదు. ఈ పాత్ర కోసం శ్రద్దాకపూర్‌ని ఎందుకు తీసుకొచ్చారో అర్థం కాదు. తన పాత్రకు తగ్గట్టు ఎప్పుడూ సీరియస్ లుక్‌లో కనిపిస్తుంటుంది. ఆఖరికి పాటల్లో కూడా. ఒక్కో పాత్రలో రెండు మూడు పార్శ్వాలుంటాయి. కాకపోతే.. వాటిని ఈజీగా క్యాచ్ చేసేయొచ్చు. నటీనట వర్గం లిస్టు చాంతాడంత ఉంది. కొంతమంది పేర్లు గుర్తుండవు. తెలిసినవాళ్లకేమో సరైన పాత్రలు ఇవ్వలేదు. బిల్డప్సీన్లు, హడావుడి మాత్రం కావల్సినంత ఉన్నాయి.
ఇంత ఖర్చు పెట్టిన సినిమా టెక్నికల్‌గా హై స్టాండర్డ్‌లో లేకపోతే ఎలా? ఆ అర్భాటాలు కావల్సినన్ని ఉన్నాయి. అబుదాబిలో తెరకెక్కించిన ఛేస్ చూస్తే – ఆ భారీదనం అర్థం అవుతుంది. కాకపోతే సరైన కథలేనప్పుడు, కథని ఆసక్తిగా నడపలేకపోతున్నప్పుడు ఎన్ని హంగులు చేసినా వృథానే. మది కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. యాక్షన్ సీన్లలో ఆయన కష్టం అర్థమవుతుంది. పాటలన్నీ స్పీడు బ్రేకర్లే. లొకేషన్లు అబ్బుర పరుస్తున్నా – ఒక్క పాట కూడా ఆహ్లాదకరంగా అనిపించదు. రెండో సినిమాకే ఇంత పెద్ద ప్రాజెక్టుని ఎలా మోస్తాడా? అని సుజిత్‌ని చాలామంది అనుమానించారు. దురదృష్టవశాత్తూ ఆ అనుమానాలు నిజమైపోయాయి. నిజానికి ఇది సుజిత్ తప్పు కూడా కాదు. నిర్మాతల్నీ, ప్రభాస్‌నీ ఏం చెప్పి మెప్పించాడో మరి?!
పాన్ ఇండియా అనే మాట బాహుబలితో ఎక్కువగా వినిపించింది. హిందీలోనూ పాగా వేయాలని మన హీరోలంతా ఉత్సాహంగా ఉవ్వీళ్లూరారు. సాహో చూశాక… ఈ ఉత్సాహం, ఊపు తగ్గే అవకాశాలున్నాయి. కొన్నాళ్ల వరకూ పాన్ ఇండియా సినిమా అన్నా, వందల కోట్ల బడ్జెట్ అన్నా – తెలుగు హీరోలు, నిర్మాతలు ఆలోచించుకోవాల్సిన అవసరాన్ని క ల్పించింది సాహో.
ఫినిషింగ్ టచ్: సారీ.. సాహో
తెలుగు360 రేటింగ్: 2