వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి ఏడాది పూర్తయిందని.. ఏకంగా బ్యానర్ స్టోరీ రాసుకున్నారు. ఎన్నో అడ్డంకులు అధిగమించి మరీ యాత్ర చేస్తున్నట్లు.. చెప్పుకొచ్చారు. అది సాక్షి జర్నలిస్టుల వృత్తి ధర్మం. అంత వరకూ బాగానే ఉంది కానీ.. ఓ పేజీలో వచ్చిన వార్త చూసి.. సాక్షి పాఠకులు కూడా నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. రాజన్న బిడ్డ ఎట్లుండాడో అని.. ప్రజలంతా గుడ్ల కళ్ల నీరు కక్కుకుంటూ.. ఉన్నారట..! పూజలు చేస్తున్నారట..! తిండి తిప్పలు మానేసి ఆయన బయటకు వచ్చి ఎప్పుడు కనిపిస్తారా ..? అని ఎదురు చూస్తున్నారట.. ఆయన త్వరగా కోలుకోవాలని… ప్రార్థిస్తున్నట్లుగా ఓ కథనం రాసుకొచ్చారు. దీన్ని చూసిన వైసీపీ అభిమానులు కూడా.. జగన్పై ప్రజల్లో అభిమానం పెంచుతున్నారా.. లేక మరింత కామెడీ చేస్తున్నారా..? అనే అసహనాన్ని వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై.. విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన కోడి కత్తి దాడిని… తమకు అనుకూలంగా ప్రజల ముందు పెట్టడంలో వైసీపీ కానీ.. జగన్ మీడియా కానీ అట్టర్ ఫ్లాపయింది. దాన్ని… అతి పెద్దదిగా చూపే ప్రయత్నంలో మొత్తానికే సీరియస్ నెస్ లేకుండా చేశారు. అసలు భద్రతా వైఫల్యాన్ని అందరూ మర్చిపోయేలా … జగన్ మీడియా.. చంద్రబాబును గురి పెట్టడంతో.. రాజకీయం అయిపోయింది. అసలు దాడి జరిగిన తర్వాత జగన్ ఉత్సాహంగా.. ఉల్లాసంగా నడుచుకుంటూ వెళ్లడం అందరూ చూశారు. హైదరాబాద్ ఎయిర్పోర్టులోనూ అదే చూశారు. కానీ అనూహ్యంగా ఆ తర్వాత ఆస్పత్రిలో చేరడం… ఆపరేషన్ చేశారని చెప్పుకోవడం.. 9 కుట్లు అని ప్రచారం ప్రారంభించడమే కాదు.. ఏకంగా వారాల తరబడి విశ్రాంతి తీసుకోవాలని.. డాక్టర్లు సూచించడం.. దానికి తగ్గట్లుగా జగన్ బయటకు రాకపోవడంతో.. ఇదంతా డ్రామానే అన్న అభిప్రాయం ప్రజలకు వచ్చేసింది. ఈ కారణంగానే ప్రజల్లో ఏ మాత్రం జగన్ పై సానుభూతి రాలేదు. వైసీపీ క్యాడర్లోనూ ఆ ఎమోషన్ లేదు.
జగన్ కొన్నాళ్లు బయటకు కనిపించకపోతే.. క్యాడర్లో ఓ రకమైన అలజడి వస్తుందని.. అది తమ పార్టీకి బూస్ట్ గా మారిపోతుందని… వైసీపీ అనుకున్నారేమో కానీ.. అలాంటిదేదీ లేదు. దాంతో.. జగన్ కోసం ప్రజలు… ఎదురు చూస్తున్నారని.. చెప్పుకునేందుకు.. జగన్ పాదయాత్ర వార్షికోత్సవాన్ని వాడుకుంది. కొంత మంది రియాక్షన్స్ అంటూ ప్రచురించింది. అవన్నీ… సాక్షి పత్రికలో వచ్చే పిట్టకథల్లానే ఉన్నాయి. నాలుగేళ్ల పిల్లాడికి పేరు పెట్టడం..మూడేళ్ల పాప .. జగన్ కోసం అన్నం మానేయడం.. ఐదేళ్ల పిల్లగాడు పాదయాత్ర కోసం స్కూల్ ఎగ్గొట్టడం.. ఇలాంటి తరహా కథనంలానే అది ఉంది. కానీ జగన్ పై సానుభూతి పెంచేలా లేదు. కోడి కత్తి దాడిని మరింత… పలుచన చేసేలా ఉంది. జగన్కు సాక్షి పత్రిక ఎంత మేలు చేస్తుందో కానీ.. కీడు మాత్రం ఎక్కువగానే చేస్తోందని.. ఇలాంటి కథనాలతో తేలిపోతోంది.