మార్కెట్‌తో, బడ్జెట్ రికవరీతో సంబంధం లేకుండా తన ప్రతి సినిమాకీ హంగు ఆర్భాటాలు పెంచుకుంటూ వెళ్తున్న కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్. తనయుడిని కథానాయకుడిగా నిలబెట్టడం కోసం తొలి సినిమా ‘అల్లుడు శీను’కి భారీగా ఖర్చు చేశారు బెల్లంకొండ సురేష్. తరవాత సినిమాలకూ భారీ బడ్జెట్ అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది. ఒకవేళ నిర్మాత బడ్జెట్ ఎక్కువ అవుతుందని భావిస్తే బెల్లంకొండ సురేష్ కొంత సర్దుబాటు చేస్తారని ఇండస్ట్రీ గుసగుస.
‘స్పీడున్నోడు’లో తమన్నా ఐటమ్ సాంగ్ ఖర్చు ఆయనే భరించారని భోగట్టా. అయితే బడ్జెట్‌కి తగ్గ వసూళ్లు, లాభాలు సాధించడంలో బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలు విఫలమవుతున్నాయి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ‘జయ జానకి నాయక’ సినిమాకి అటు ఇటుగా 40 కోట్ల కలెక్షన్స్ వచ్చినా నిర్మాతకు లాభాలు రాకపోవడానికి భారీ బడ్జెట్టే కారణం. ఆ భారీతనమే ‘సాక్ష్యం’ నిర్మాతను కష్టాల్లోకి నెట్టిందనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ వర్గాల టాక్.
బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో అభిషేక్ నామ నిర్మించిన సినిమా ‘సాక్ష్యం’. అంతా సజావుగా సాగినట్టయితే మరో రెండు గంటల్లో మొదటి షో పడేది. కానీ, థియేటర్లకు ఇంకా డిజిటల్ కీ అందకపోవడంతో పలుచోట్ల మార్నింగ్ షోలు క్యాన్సిల్ అయ్యాయి. హైదరాబాద్ ఐమాక్స్ లో మార్నింగ్ 8.45 షో క్యాన్సిల్ అయ్యింది. ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న ప్రేక్షకులకు పదిరోజుల్లో మీ టికెట్ డబ్బులు ఎకౌంటులోకి వాపసు వస్తాయని సందేశంలో పేర్కొన్నారు. ఒక్క హైదరాబాద్‌లో మాత్రమే కాదు… తెలంగాణ, ఆంధ్ర, సీడెడ్ ఏరియాల్లో మార్నింగ్ షోలు పడటం లేదని సమాచారం. ఏ థియేటర్‌కీ ఇంకా ‘సాక్ష్యం’ ప్రింట్ అందలేదు.
ఒకప్పుడు థియేటర్లకు ప్రింట్స్ పంపేవారు. డిజిటల్ జమానా వచ్చేసిన తరవాత డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ (క్యూబ్, యు.ఎఫ్.ఓ.)లో ప్రింట్ అప్లోడ్ చేసి థియేటర్ యాజమాన్యానికి ‘కీ’ ఇస్తే చాలు. డిజిటల్ ప్రింట్ డౌన్లోడ్ చేసుకుని షోలు వేస్తున్నారు. సాధారణంగా ఒక్క రోజు ముందే థియేటర్ జనాలకు డిజిటల్ ప్రింట్ వెళ్తుంది. డౌన్లోడ్ చేసుకుంటారు.
‘సాక్ష్యం’ ప్రింట్ కోసం గురువారం రాత్రి నుంచి థియేటర్లలో సిబ్బంది పడిగాపులు కాస్తున్నార్ట. 40 కోట్ల భారీ బడ్జెట్ సినిమా ప్రింట్ థియేటర్లకు సకాలంలో చేరలేదంటే సమస్య ఏంటనేది సులభంగా వూహించవచ్చు. ప్రస్తుతం పది గంటలకు షోలు పడేలా తీవ్ర కృషి చేస్తున్నారు. నిజానికి, నిన్న సాయంత్రమే మార్నింగ్ షోలు క్యాన్సిల్ అయ్యే అవకాశాలు వున్నాయని థియేటర్ యాజమాన్యాలకు సూచనలు అందాయట. తరవాత తెల్లవారుజామున మూడింటికి ప్రింట్ మీ వద్దకు చేరుతుందని సమాచారం వచ్చిందట. ఇంకా థియేటర్లకు ప్రింట్స్ అయితే చేరలేదు. ఎప్పటికి చేరతాయో. ఎప్పుడు షోలు పడతాయో. మీడియాకి కూడా మొదట 8.45కు ఐమ్యాక్స్‌లో షో అని తరవాత పది గంటలకు ప్రసాద్ ల్యాబ్‌కి మార్చారు.