ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్న రోజులివి. కాన్సెప్ట్ ఒక్కటే కాదు… ఆ కాన్సెప్టుని కన్వే చేయడమూ కొత్తగా వుండాలని కోరుకుంటున్నారు. పాత సినిమా వాసనలు వస్తే ఇట్టే పసిగడుతున్నారు. అటువంటిది ‘ప్రైడ్ ఆఫ్ ఇండియా’ అని పొగిడిన ‘బాహుబలి’లో సీన్ యధాతథంగా వాడేస్తే ప్రేక్షకులు గుర్తు పట్టలేరని దర్శకుడు శ్రీవాస్ ఎలా అనుకున్నారో! బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఆయన దర్శకత్వం వహించిన ‘సాక్ష్యం’ నిన్న (శుక్రవారం) విడుదలైంది. అందులో ఓపెనింగ్ సీన్లలో ఒకటి చూడగానే ‘బాహుబలి’లో సీన్ గుర్తొస్తే ప్రేక్షకులది తప్పు కాదు. అంత గుర్తొచ్చేలా తీశారు. ‘బాహుబలి’లో దేవసేన(అనుష్క)కు జన్మించిన మహేంద్ర బాహుబలి/శివుడి(ప్రభాస్)ని భల్లాలదేవ (రానా) నుంచి శివగామి రక్షించే సన్నివేశం గుర్తుందా? ఆ సన్నివేశమే గుర్తొస్తుంది!
‘బాహుబలి’లో రమ్యకృష్ణ… ‘సాక్ష్యం’లో మీనా! అందులో… వెన్నులో బాణాలు దిగినా పిల్లాడిని కాపాడాలని పరమేశ్వరుడిని వేడుకున్న రమ్యకృష్ణ. ఇందులో… వెన్నులో కత్తి దిగినా పిల్లాడిని కాపాడాలని ఈశ్వరుడిని వెదుకున్న మీనా. సన్నివేశం రాయడంలోనూ, తీయడంలోనూ ఎన్నో సిమిలారిటీస్ కనిపిస్తాయి. శివుడి వాహనం నంది కనుక.. సినిమాలో నంది(ఎద్దు)ని ముఖ్య పాత్రగా అనుకుని కీలక సన్నివేశాలు రాసుకోవడంతో ఈశ్వరుడి పేరు తప్ప మరో దేవుడి పేరు డైలాగులో రాయించే అవకాశం శ్రీవాస్ కి రాలేదేమో. పోనీ సన్నివేశం తీయడంలోనైనా కొత్తదనం చూపించాల్సింది. కథాపరంగానూ ‘సాక్ష్యం’లో ‘బాహుబలి’ వాసనలు కనిపిస్తాయి. అందులో తమన్నా ప్రేమ కోసం వచ్చిన హీరోకి తండ్రిని చంపిన వాళ్ల గురించి తెలుస్తుంది. ప్రతీకారం తీర్చుకుంటాడు. ఇందులో పూజా హెగ్డే ప్రేమ కోసం వచ్చిన హీరో తండ్రిని చంపిన వాళ్లను పంచభూతాల సహాయంతో చంపుతాడు. కానీ, అతని తండ్రిని వాళ్లే చంపారని అతడికి తెలీదు. అంతే తేడా. దాన్ని కొత్తగా ఫీలైనట్టు వున్నారు. శ్రీవాస్ కాన్సెప్ట్ కొత్తదే కానీ రొటీన్ వేలో తీయడం వల్ల ఈ పోలికలు వస్తున్నాయి. బహుశా.. ఇవి చూసే ‘మినీ బాహుబలి’ని విడుదలకు ముందు ఇంటర్వ్యూ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చెప్పాడేమో!!