ఓ పాటని ఇది వరకు ఒకే గాయకుడు పాడే వాడు. ఆ తరవాత వెరైటీ కోసం ఇద్దరు గాయకులతో పాడించడం మొదలెట్టారు. ఈసారి ఒకే పాటని అయిదుగురు గాయకులతో పాడించారు. `సాక్ష్యం` కోసం. కాకపోతే.. ఈ పాట ఓ కాన్సెప్ట్ ప్రకారం సాగిపోతుందట. పంచభూతాల నేపథ్యంలో నడిచే కథ `సాక్ష్యం`. పంచభూతాల విశిష్టతను చెబుతూ ఓ పాట కంపోజ్ చేశారు ఈ సినిమాలో. అది సినిమాలో అక్కడక్కడ సందర్భానుసారం వస్తుంటుంది. ఈ పాటని అయిదుగురు గాయకులతో పాడించారు. ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, జేసుదాస్, హరిహరన్, కైలాష్ ఖేర్, బోంబే జయశ్రీ ఈ పాటని ఆలపించారు. అయిదుగురూ పెద్ద గాయకులే. అనంత శ్రీరామ్ ఈ పాటని అందించారు. ఓ థీమ్ ప్రకారం సాగే ఈ పాట.. సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చిత్రబృందం చెబుతోంది. బెల్లంకొండ సాయిశ్రీనివాస్, పూజా హెడ్గే జంటగా నటించిన ఈ చిత్రానికి శ్రీవాస్ దర్శకుడు. జులై 20న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.