తెలుగుదేశం పార్టీ నేత.. సమకాలిన రాజకీయాలను సమర్థంగా విశ్లేషించగల.. అద్భుత వాగ్దాటి ఉన్న నేతగా పేరు తెచ్చుకున్న మాజీ ఎంపీ సబ్బం హరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయనకు కరోనా సోకింది. దాంతో పాటు మరికొన్ని ఇన్ఫెక్షన్లు కూడా ప్రభావం చూపడంతో ఆయన శ్వాసపీల్చుకోవడం కష్టంగా మారింది. నాలుగైదు రోజుల కిందట ఆయన ఆస్పత్రిలో చేరారు. అప్పట్నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తూ వస్తోంది. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.
కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడైన సబ్బంహరి ఆ పార్టీ నుంచి విశాఖ మేయర్ గా గెలిచారు. వైఎస్‌కు ఆత్మీయుడిగా పేరు పొందారు. అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అయితే ఆయన ఎంపీగా ఉన్న సమయంలోనే రాష్ట్ర విభజన బిల్లు రావడంతో.. హైకమాండ్ ను ధిక్కరించారు. నిజానికి వైఎస్ చనిపోయిన తర్వాత ఆయన జగన్‌కు సపోర్టుగా నిలిచారు. అన్ని విషయాల్లోనూ చేదోడోవాదోడుగా ఉన్నారు. కారణమేమిటో కానీ.. జగన్ ఆయనను దూరం పెట్టారు. 2019 ఎన్నికలకు ముందు.. టీడీపీలో చేరారు. భీమిలి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి.. ఓటమి పాలయ్యారు.
టీడీపీ తరపున ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన ఎప్పుడూ పాల్గొనలేదు…కానీ.. ఆయన మీడియాలో తరచూ కనిపించేవారు. ప్రభుత్వ విధానాల్ని తీవ్రంగా విమర్శించేవారు. ఈ కారణంగానే… విశాఖలోని ఆయన ఇంటిలో కొంత భాగాన్ని ప్రభుత్వ అధికారులు కూల్చివేశారు. అప్పుడు ఆయన ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన కోలుకోవాలని టీడీపీ నేతలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.