ఎన్నికల సమయంలో ఆయారాం.. గయారంల హడావుడి ఉంటుంది ఉత్తరాంధ్రలో ఖాళీగా ఉన్న నేతలు.. అటు టీడీపీ – ఇటు వైసీపీ మధ్య చక్కర్లు కొట్టారు. కానీ ఒక్క సబ్బం హరి మాత్రం.. నిలకడగా టీడీపీకి మద్దతిస్తూ వస్తున్నారు. కానీ సబ్బం హరికి.. టీడీపీలో ఇప్పటికే ఉన్న నేతలకు పొసగని పరిస్థితి ఉంది. అందుకే చంద్రబాబు అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించారు. చివరి జాబితాలో ఆయన పేరును ఖరారు చేశారు. ఆయన కోసమే…భీమిలి టిక్కెట్‌ను అట్టి పెట్టారు. చాలా రోజులుగా ఆయన.. టీడీపీకి మద్దతుగా గట్టి వాదన వినిపిస్తున్నారు. టీడీపీ అధికార ప్రతినిధులు కూడా చేయనంత గట్టిగా… తన వాదన వినిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన టీడీపీలో చేరవచ్చని చెబుతూ వచ్చారు. టిక్కెట్ల ఖరారవుతున్న సమయంలో ఆయన పేరు ఎక్కడా వినిపించలేదు. కానీ… పేరు మాత్రం ఖరారయింది.
నవ్యాంధ్ర అభివృద్ధికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తూ, ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న చంద్రబాబే రాష్ట్రానికి పెద్ద దిక్కని ఆయన ఇటీవల పలుసార్లు తన అభిప్రాయం వ్యక్తంచేశారు. ప్రస్తుతం ఆయన అధికారికంగా టీడీపీలో చేరలేదు.కానీ.. పలుమార్లు చంద్రబాబునుకలిశారు. ఆ సమయంలో.. అనకాపల్లి పార్లమెంటు స్థానానికి గానీ, విశాఖ ఉత్తరం అసెంబ్లీ స్థానానికి గానీ పోటీ చేసే అవకాశం కల్పించాలని ఆలోచించారు. కానీ.. అన్ని సర్వేలు పూర్తి చేసి… భీమిలి కరెక్ట్ అని నిర్ణయించారు. దీనికి సబ్బం హరి కూడా ఓకే చేశారు. సబ్బం హరిది ప్రత్యేక శైలి. విశాఖ మేయర్‌గా చేశారు. 2009 ఎన్నికల్లో అనకాపల్లి లోక్‌సభ టికెట్ సాధించి, ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి అల్లు అరవింద్‌ను ఓడించి ఎంపీగా ఎన్నికయ్యారు. మొదట్లో వైఎస్ జగన్‌కు మద్దతుగా ఉన్నప్పటికీ.. ఆయన తీరు నచ్చక దూరమయ్యారు.
రాష్ట్ర విభజన సమయంలో నాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి మద్దతుగా నిలిచారు. ఏకంగా పార్టీప్రభుత్వంపైనే అవిశ్వాస తీర్మానానికి నోటీసిచ్చారు. కాంగ్రెస్ బహిష్కరించిన ఆరుగురు ఎంపీల్లో ఆయన కూడా ఉన్నారు. 2014 ఎన్నికల్లో కిరణ్‌కుమార్‌రెడ్డి పెట్టిన జై సమైక్యాంధ్ర పార్టీలో చేరారు. ఆ పార్టీ తరపున విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయడానికి నామినేషన్ వేశారు. ఆఖరి నిమిషంలో మనసు మార్చుకొని టీడీపీ-బీజేపీ ఉమ్మడి అభ్యర్థి హరిబాబుకు మద్దతు ప్రకటించారు. టీడీపీ, బీజేపీ రెండూ ఆయన్ను తమ పార్టీల్లోకి ఆహ్వానించాయి. కానీ బీజేపీని తీవ్రంగా విమర్శిస్తున్న ఆయన టీడీపీవైపే మొగ్గు చూపారు. చాలా మంది నేతలు… అటూ ఇటూ.. చూశారు కానీ.. సబ్బం చూడలేదు. వారికి టిక్కెట్లు దక్కలేదు. కానీ సబ్బంకు మాత్రం చాన్సిచ్చారు.