విశాఖ జిల్లా రాజకీయాలు అనగానే అధికార పార్టీలో మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు గుర్తొస్తారు. ఈ ఇద్దరూ పార్టీకి పెద్దదిక్కుగా ఉన్నప్పటికీ, ఇద్దరి మధ్యా టామ్ అండ్ జెర్రీ ఫైట్ ఎప్పటికప్పుడు తెరమీదికి వస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యంతో కొన్నాళ్లపాటు అంతా సద్దుమణిగినట్టే కనిపిస్తుంది. ఈ పరిస్థితి ఇలా ఉంటే… జిల్లా టీడీపీలోకి మరో సీనియర్ నేత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనకాపల్లి మాజీ ఎంపీ, విశాఖపట్నం మాజీ మేయర్ సబ్బం హరి త్వరలో టీడీపీలో చేరబోతున్నట్టు స్థానికంగా ప్రచారం జరుగుతోంది.
ఈ మధ్య కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబుపై సబ్బం హరి ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదే క్రమంలో భాజపాని కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఆంధ్రాకి అన్యాయం చేశారంటూ వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో సహజంగానే ఆయన టీడీపీకి అనుకూలంగా ఉన్నారనే ప్రచారం మొదలౌతుంది. అయితే, అలా మొదలైన ప్రచారంలో వాస్తవం ఉందనీ, ఆయన టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సబ్బం హరిని చేర్చుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అంగీకారం తెలిపినట్టు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, విశాఖ నార్త్ నియోజక వర్గం నుంచి ఆయన టీడీపీ తరఫున పోటీ చేస్తారనే టాక్ కూడా వినిపిస్తోంది. విశాఖలో హరికి రాజకీయంగా కొంత పట్టు ఉండటం, ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి… ఆయన సేవలు పార్టీకి ఉపయోగపడతాయనే నమ్మకంతోనే హరి చేరికకు సీఎం గ్రీన్ సిగ్నల్ లభించినట్టు సమాచారం.
నిజానికి, వైయస్ మరణం తరువాత జగన్ వెంట ఉన్నవారిలో ఈయనా ఒకరు. ఆ తరువాత, నెమ్మదిగా వైకాపాకి దూరమయ్యారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన పార్టీలో చేరారు. విశాఖ ఎంపీగా నామినేషన్ వేసినా, చివరి క్షణంలో వెనక్కి తగ్గారు. అప్పట్నుంచీ కొంత తటస్థంగానే ఉంటున్నారు. దీంతో ఇప్పుడు ఆయన టీడీపీవైపు చూస్తున్నట్టు సమాచారం. అయితే, ఇదే సమయంలో ఘర్ వాపసీ కార్యక్రమంలో భాగంగా తటస్థ నేతలపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించిన సంగతీ తెలిసిందే. కానీ, సబ్బం హరి అటువైపు వెళ్లే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అనుచర వర్గం చెబుతోంది. ఇక, ఆయన టీడీపీలోకి వస్తే విశాఖ జిల్లా టీడీపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేదే ఆసక్తికరమైన అంశం అవుతుంది. స్థానిక ప్రముఖ నేతలు ఆయన రాకను ఎలా స్వాగతిస్తారు, ఆయనకి ఎలాంటి సహకారం అందిస్తారనేది వేచి చూడాల్సిన అంశం. సబ్బం హరిని పార్టీలోకి తీసుకుని, ఆయన విశాఖలో ప్రాధాన్యత కల్పిస్తే.. ఇప్పుటికే ఒకే ఒరలో ఇరుక్కుని ఇముడుతున్న ఆ ఇద్దరి నేతల స్పందన ఎలా ఉంటుందనేదీ ఆసక్తికరమైన అంశమే అవుతుంది.