Sabdham Movie Review
తెలుగు360 రేటింగ్: 2.25/5
భయపెట్టడంలో ఎన్ని రకాలు ఉంటాయో వాటన్నింటినీ వాడేశారు మన దర్శకులు. హారర్ అనే ఎలిమెంట్‌ని మిగిలిన అన్ని జోనర్లూ మిక్స్ చేసి థ్రిల్ చేసే ప్రయత్నం చేశారు. కొన్నాళ్లుగా హారర్ సినిమా అంటేనే భయం పట్టుకొంది. ఎందుకంటే.. ఏ సినిమా అంచనాల్ని అందుకోలేకపోయింది. ఇలాంటి కథలు చూసీ చూసీ ప్రేక్షకులకూ బోర్ కొట్టేసింది. అయితే ఇటీవల బాలీవుడ్ లో కొన్ని హారర్ చిత్రాలు మంచి ఫలితాల్ని రాబట్టాయి. వందల కోట్లు కొల్లగొట్టాయి. దాంతో మళ్లీ భయపెట్టే ప్రయత్నాలు మొదలెట్టేశారు. ఈ తరహా కథలు ఒకొక్కటిగా ప్రేక్షకులపై దాడి చేస్తున్నాయి. ‘శబ్ధం’ కూడా అలాంటిదే. ఆది పినిశెట్టి చేసిన తమిళ సినిమా ఇది. తెలుగులోనూ విడుదల చేశారు. మరి ఈ ‘శబ్ధం’ ఎలా ఉంది? ప్రేక్షకుల్ని భయపెట్టే ఫ్రీక్వెన్సీ… ఈ కథలో ఉందా? భయపెట్టడంలో దర్శకుడు ఎంచుకొన్న కొత్త దారి ఎలా వుంది?
హ్యూమా (ఆది పినిశెట్టి) ఓ ఘోస్ట్ ఇన్వెస్టిగేటర్. చనిపోయిన తరవాత ఆత్మలు మన మధ్యే ఉంటాయని, అవి ఏదో రూపంలో కమ్యునికేట్ చేయాలనుకొంటాయని బలంగా నమ్ముతుంటాడు. మైసూర్‌లోని ఒక మెడికల్ కాలేజీలోని విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలు చేసుకొంటుంటారు. అక్కడ ఆత్మలు తిరుగుతున్నాయని, అందువల్లే విద్యార్థులు చనిపోతున్నారన్న పుకారు మొదలవుతుంది. అది నిజమో కాదో తెలుసుకోవడానికి హ్యూమాని అక్కడికి పిలిపిస్తుంది కాలేజీ యాజమాన్యం. దాంతో హ్యూమా ఆపరేషన్ మొదలవుతుంది. అదే కాలేజీలో అవంతిక (లక్ష్మీ మీనన్) పరిచయం అవుతుంది. అక్కడ ఆత్మలు ఉన్నాయా? లేదా? ముఫ్ఫై ఐదేళ్ల క్రితం కోమాలోకి వెళ్లిపోయిన డయానా (సిమ్రాన్) కథేమిటి? ఇవన్నీ వెండి తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
హారర్ సినిమా అంటే… ఓరకమైన అభిప్రాయం ఏర్పడిపోయింది. రకరకాల వింత రూపాల్ని చూపించి భయపెట్టడమే హారర్ సినిమాలోని టెక్నిక్. దెయ్యాల మేకప్పులు, ఆ బిల్డప్పులు ఏ రేంజ్లో ఉంటే, ఆ స్థాయిలో భయం వర్కవుట్ అవుతుంది. అయితే `శబ్ధం`లో ఆ పంథా మారింది. హారర్‌ని శబ్ధం ద్వారా కూడా పుట్టించొచ్చని టీమ్ నమ్మింది. ఓరకంగా ఇదో ప్రయోగం అనుకోవాలి. సినిమాలో ఎక్కడా దెయ్యాలు కనిపించవు. కేవలం శబ్ధం చేస్తాయంతే. ఆ శబ్ధాల వెనుక ఉన్న కథేమిటి? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఓరకంగా ఆలోచన వరకూ బాగుంది. కానీ ఆచరణ అంత సవ్యంగా సాగలేదు. ‘వైశాలి’ గుర్తుంది కదా? అందులో దెయ్యానికి నీటికీ ఓ లింక్ ఉంటుంది. దెయ్యం నీటిని ఓ వాహికగా భావిస్తుంది. ఆ పాయింట్ భలే వర్కవుట్ అయ్యింది. కొత్తగానూ ఉంది. ఆ దర్శకుడే ఇప్పుడు ‘శబ్ధం’ చిత్రాన్ని రూపొందించాడు. కాకపోతే `వైశాలి`లో ఉన్న థ్రిల్… ‘శబ్ధం’లో లేదు. ఫస్టాఫ్ వరకూ ఏదో జరుగుతోందన్న సంగతి అర్థమవుతూ ఉంటుంది. కానీ ఏం జరుగుతుందో తెలీదు. ఇంట్రవెల్ బ్యాంగ్, అక్కడ ఓ పది నిమిషాల పాటు నడిపిన ఉత్కంఠత బాగుంది. ఓ దశలో స్క్రీన్ పై బొమ్మ ఏం కనిపించదు. కేవలం శబ్ధాలు వినిపిస్తాయి. ప్రేక్షకులు ‘ప్రొజెక్టర్ ఏమైనా ఇబ్బందేమో’ అనుకొనే ప్రమాదం కూడా ఉంది. ఆ గందరగోళంలోనే మళ్లీ స్క్రీన్‌పై దృశ్యం కదలాడుతుంది. ఓరకంగా టైటిల్ కి అక్కడ జస్టిఫికేషన్ జరిగిందనుకోవాలి.
ద్వితీయార్థంలో అనాథలు, గబ్బిలాలు, మ్యూజిక్ థెరపీ, బ్లాక్ మ్యాజిక్ అంటూ రకరకాల విషయాలు చెప్పే ప్రయత్నం చేశారు. ఆ ఇన్వెస్టిగేషన్ పెద్దగా ఆసక్తిని కలిగించదు. చివర్లో వచ్చిన ట్విస్ట్ సైతం థ్రిల్లింగ్ గా లేదు. ఆత్మలు శబ్ధాన్ని వాహికగా తీసుకోవడం బాగుంది. కాకపోతే.. సినిమా అనేది దృశ్యమాధ్యమం. హారర్ సినిమాల్లో దెయ్యాల కదలికలు, వాటి స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకుల్ని భయపెడతాయి. ఇక్కడ అలాంటివేం లేకపోవడం వల్ల భయం డోస్ తగ్గింది. సెకండాఫ్ చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. సబ్జెక్ట్ అలాంటిది. ఏమాత్రం బుర్ర పెట్టకపోయినా ఆ ఫ్లోని పట్టుకోలేం. థ్రిల్లర్ సినిమాల్లో ఫజిల్స్ అవసరమే. కానీ అవి ప్రేక్షకుల్ని కన్ఫ్యూజ్ చేసే స్థాయిలో ఉండకూడదు. వాళ్లను కంగారూ పెట్టకూడదు. ‘ఎందుకంటే ప్రేమంట’ సినిమాలో దర్శకుడు ఓ వెరైటీ పాయింట్ పట్టుకొన్నాడు. అలాంటి పాయింటే ఈ కథలోనూ ఉంది. కాకపోతే ‘ఎందుకంటే ప్రేమంట’ ఓ ప్రేమకథ. ఇదో హారర్ స్టోరీ. అంతే తేడా. ‘ఎందుకంటే ప్రేమంట’ ఫ్లాప్ అవ్వడానికి దర్శకుడు ఎంచుకొన్న పాయింటే కారణం. మనుషులు బతికి ఉండగానే ఆత్మలు బయటకు రావడం అనే పాయింట్ తెలుగు ప్రేక్షకులకు ఎక్కలేదు. ఇక్కడా అదే పొరపాటు జరిగింది.
ఆది పినిశెట్టి కొత్త తరహా కథలు ఎంచుకొంటుంటాడు. ఈసారీ అదే చేశాడు. తన వాయిస్ ఎప్పుడూ ప్లస్సే. తన గొంతులో ఉండే ఇంటెన్సిటీ ఈ పాత్రకు బాగా పనికొచ్చింది. లక్ష్మీ మీనన్‌ది రెగ్యులర్ హీరోయిన్ పాత్ర కాదు. తను కూడా అవంతిక పాత్రకు న్యాయం చేసింది. సిమ్రాన్ కథలో కీలక పాత్ర పోషించారు. సెకండాఫ్‌లో ఆ పాత్రే చాలా కీలకంగా మారింది. లైలా సర్ప్రైజ్ చేస్తుంది. రెడిన్ కింగ్స్లే ఫస్టాఫ్‌లో నవ్వించే ప్రయత్నం చేశాడు. కానీ ఆ పాత్ర మాట్లాడే ప్రతీ రెండు మాటల్లోనూ ఓ బూతు వినిస్తుంది.
టెక్నికల్ గా ‘శబ్ధం’ బాగా సౌండ్ చేసింది. ముఖ్యంగా తమన్ అందించిన ఆర్.ఆర్. కొన్ని థీమ్స్ బాగున్నాయి. అయితే అక్కడక్కడ ‘శబ్ధం’ శ్రుతిమించింది. కొన్ని చోట్ల మరింత ఇరిటేట్ చేస్తుంది. పాత్రలు శబ్ధాన్ని వినలేక.. చెవులు మూసుకొంటుంటారు. అంత ఇంపాక్ట్ థియేటర్లో ప్రేక్షకుడికీ కలుగుతుంది. కెమెరా వర్క్ చాలా చక్కగా వుంది. కొన్ని సీన్లు బాగా కంపోజ్ చేశారు. ముఖ్యంగా శబ్దానికి తగిన విజువల్స్ ని బాగా ప్రజెంట్ చేశారు. దర్శకుడు ఓ కొత్త పాయింట్ చెప్పాలనుకొన్నాడు. ఐడియా పరంగా అది బాగుంది కూడా. కానీ… ఎక్కువ విషయాలు మిక్స్ చేసి, సామాన్య ప్రేక్షకుడి బుర్రకు అందని అంశాలు జోడించి, కథని కాంప్లికేటెడ్ చేసేశాడు. దాంతో.. అనుకొన్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయాడు.
తెలుగు360 రేటింగ్: 2.25/5