తెరాస మంత్రి సబితా ఇంద్రారెడ్డికి మరోసారి కేసుల బెడద మొదలైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పనిచేసినప్పుడు నమోదైన కేసు మళ్లీ ఇప్పుడు తెర మీదికి వచ్చింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీదున్న ఆదాయానికి మించిన ఆస్తులు కేసుల్లో పెన్నా సిమెంట్స్ కి సంబంధించిన కేసు కూడా ఒకటుంది. పెన్నా సిమెంట్స్ కి అనంతపురం జిల్లాలో కొన్ని భూములు, తాండూరు పరిధిలో కొన్ని గనులను లీజుకు ఇవ్వడంలో అవకతవకలు జరిగాయనీ, నాటి మంత్రితోపాటు కొంతమంది అధికారులకు చేతివాటం ప్రదర్శించారంటూ సీబీఐ ఛార్జ్ షీటు దాఖలు చేసింది. అప్పట్లో ఈ కేసు మీద కోర్టు విధించిన స్టే, ఈ మధ్యనే ఎత్తేశారు. దీంతో మళ్లీ విచారణకు వచ్చింది. మంత్రి సబితా రెడ్డికి కూడా సమన్లు అందాయి. సీబీఐ కోర్టుకు 17న హాజరు కావాల్సి ఉంది.
ప్రస్తుతం ఆమె తెలంగాణ మంత్రిగా ఉంటూ కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో, తెలంగాణ మంత్రి కూడా అక్రమార్జన కేసులో ఇరుక్కుని కోర్టుకు వెళ్తున్నారనీ, అలాంటివారిని కేబినెట్లో కొనసాగిస్తారా అంటూ ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చే అవకాశం ఉంది. తెరాసలో ఇదే అంశమై చర్చ జరుగుతున్నట్టు సమాచారం. మంత్రి తరచూ కోర్టులో విచారణకు వెళ్లి వస్తుంటే, దాని ప్రభావం పార్టీ ఇమేజ్ మీద పడే అవకాశం ఉందా అనే చర్చలు మొదలయ్యాయట. ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా… అప్పట్లో ఈ కేసుని కారణంగా చూపుతూ సబితను మంత్రి వర్గం నుంచి తప్పించారు. ఇప్పుడూ అదే తరహా డిమాండ్ ప్రతిపక్షాల నుంచి మొదలైతే ఎలా తిప్పి కొట్టాలనే అంశమూ పార్టీ వర్గాల్లో చర్చనీయం అవుతోందని సమాచారం.
వాస్తవానికి, ఆమె కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తెరాసలోకి వచ్చి మంత్రి అయ్యారు. సబితను తెరాసలో చేర్చుకునే సందర్భంలోనూ ఆమెపై ఉన్న ఈ కేసు అంశం చర్చకు వచ్చిందట. కానీ, అదేం పెద్ద సమస్య కాదులే, దాన్ని ఎవరు పట్టించుకుంటార్లే అన్నట్టుగా అప్పట్లో తెరాస లైట్ తీసుకుందని అంటారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీటుకి రాజీనామా చేయకుండా మంత్రి కావడం మీద కొన్ని విమర్శలున్నాయి. ఇప్పుడు కేసులంటూ కోర్టుకు తరచూ వెళ్లి వస్తున్నా కూడా పార్టీ అధినాయకత్వం చూస్తూ ఊరుకుంటే తెరాసకు చెడ్డపేరు వస్తుందేమో అనే అభిప్రాయాలు మెల్లగా మొదలైనట్టు తెలుస్తోంది.