రాజస్థాన్ ప్రభుత్వాన్ని మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా కూల్చేసినట్లుగా కూల్చేస్తారని భావించిన సచిన్ పైలట్.. చివరికి.. హిట్ వికెట్‌గా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తన వైపు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని.. ఆయన తనకు తాను క్లెయిమ్ చేసుకుని ఢిల్లీకి వెళ్లిపోయారు. దీంతో.. కాంగ్రెస్ పార్టీ.. జైపూర్‌లోనే… సీఎల్పీ భేటీ ఏర్పాటు చేసింది. దానికి 97 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మామూలుగా అయితే.. కాంగ్రెస్‌కు 107 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అంటే సచిన్ పైలట్ కాకుండా… మరో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మాత్రమే గైర్హాజర్ అయ్యారు. వీరిలో ఇద్దరు మంత్రులు ఉన్నారు. అదే సమయంలో 10మందికిపైగా ఇండిపెండెంట్ల మద్దతు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. వారు కూడా.. భేటీకి హాజరయ్యారు.
దీంతో.. తమకు 107 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని.. కాంగ్రెస్ ప్రకటించుకుంది. వారందర్నీ…. రిసార్టులకు తరలించేసింది. మరో వైపు ఢిల్లీలో మకాం వేసిన సచిన్ పైలట్.. తన వర్గం అనుకున్న ఎమ్మెల్యేలు హ్యాండివ్వడంతో.. ఏం చేయాలో దిక్కు తోచకుండా ఉండిపోయారు. సీఎల్పీ మీటింగ్‌కు 20 మందికిపైగాఎమ్మెల్యేలు గైర్హాజర్ అయితే.. ఆయన నేరుగా వెళ్లి జేపీ నడ్డాను కలుస్తారని చెప్పుకున్నారు. కానీ.. అలాంటి పరిస్థితి లేకపోవడంతో.. బీజేపీలో చేరడం లేదని ప్రకటించారు. తాను సొంత పార్టీ పెట్టుకుంటానని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్ నేతలు వ్యూహం మార్చారు. సచిన్ పైలట్‌కు.. కాంగ్రెస్ తలుపులు మూసేయలేదని.. పార్టీలోనే ఉండొచ్చని ప్రకటించారు.
ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీ కూడా… సచిన్ పైలట్‌తో మాట్లాడినట్లుగా ప్రచారం జరిగింది. రాహుల్ గాంధీ.. అపాయింట్మెంట్ ఇచ్చారని కూడా ఢిల్లీ మీడియా చెబుతున్నా… దానిపై క్లారిటీ లేదు. అయితే.. బీజేపీ వ్యూహాలపై పూర్తి అప్రమత్తతో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. మాత్రం.. ఎమ్మెల్యేలను రిసార్టులకు తరలించింది. అసెంబ్లీని సమావేశ పరిచి బలం నిరూపించుకోవాలని భావిస్తోంది. అదే జరిగితే.. సచిన్ పైలట్.. అటూ ఇటూ కాకుండా హిట్ వికెట్ అవుతారు.