భారతదేశం గర్వించదగ్గ మేటి క్రికెట్ ప్లేయర్లలో సచిన్ టెండూల్కర్ కూడా ఒకరు. ఆయన క్రికెట్ జీవితం తెరిచినా పుస్తకం. అందులో ప్రతీ అధ్యాయం చాలా మందికి తెలుసు. దానినే సినిమాగా తీస్తే ఇంకా చాలా మందికి తెలుస్తుంది. తెలియని విషయాలెన్నో కళ్ళకు కట్టినట్లు చూపవచ్చును. అందునా సచిన్ టెండూల్కరే స్వయంగా ఆ సినిమాలో నటిస్తే ఇంక అభిమానుల ఆనందానికి అంతే ఉండదు. ‘సచిన్’ అనే పేరుతోనే నిర్మించబడుతున్న ఆ సినిమాకి ట్యాగ్ లైన్ గా ‘ఏ బిలియన్ డ్రీమ్స్’ అని పెట్టారు. ఈ సినిమాకి జేమ్స్ ఎర్కిన్ దర్శకత్వం, ఏ.ఆర్. రహమాన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమా టీజర్ నిన్న ముంబైలో విడుదల చేసారు. ఆ సందర్భంగా సచిన్ టెండూల్కర్ ఏమన్నారంటే “ఇన్నేళ్ళుగా నేను క్రికెట్ ఆడుతున్నప్పుడు దానిని చాలా మంది కెమెరాలతో షూట్ చేసారు. కానీ ఇప్పుడు ఈ సినిమా కోసం క్రికెట్ ఆడుతున్నట్లు కెమెరాల ముందు నటించవలసి వస్తోంది. అది క్రికెట్ ఆడటం కంటే చాలా కష్టంగా ఉంది నాకు. నేను క్రికెట్ ని ఆస్వాదిస్తూ ఆడేవాడిని అందుకే అదెప్పుడూ నాకు కష్టంగా అనిపించలేదు. జీవితంలో ఒక్కసారయినా కెమెరా ముందు నిలబడి నటించాలనేది నా జీవితాశయమే అయినా, తీరా చేసి కెమెరాల ముందు నిలబడేసరికి అది అంత సులువయిన పని కాదని అర్ధమయింది నాకు. అయిన ఈ సినిమా బాగా రావాలని చాలా కష్టపడుతున్నాను,” అని అన్నారు. ఈ సినిమా నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చినట్లు తెలుస్తోంది కానీ ఇంకా రిలీజ్ డేట్ ప్రకటించలేదు. నిన్న విడుదల చేసిన టీజర్ చాలా అద్భుతంగా ఉంది. సోషల్ మీడియాలో దానిపై ప్రశంశలు కురిపిస్తూ అప్పుడే చాలా హడావుడి మొదలయిపోయింది.