హైదరాబాద్: చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు నడిపే చెట్టినాడ్ గ్రూప్‌కు సంబంధించిన 35 కార్యాలయాలు, నివాసాలపై చెన్నై, హైదరాబాద్, ముంబాయిలలో ఆదాయపు పన్నుశాఖ ఇటీవల జరిపిన సోదాలలో రు.300 కోట్లకు పైగా విలువున్న అక్రమ ఆస్తులు, నగదు బయటపడ్డాయి. ఈ సోదాలలో బస్తాలకొద్దీ నగదు, బంగారు ఆభరణాలు దొరికాయి. వీటన్నింటికీ లెక్కలు, పత్రాలు లేవు. ఇవన్నీ చెట్టినాడ్ గ్రూప్ ప్రస్తుత ఛైర్మన్ ఎమ్ఏఎమ్ఆర్ ముత్తయ్యకు చెందినవని ఐటీ అధికారులు తెలిపారు. కొంతకాలంగా ఈ గ్రూప్‌పై తాము నిఘావేసి వివిధ ప్రాంతాలనుంచీ సమాచారం సేకరించి పక్కాగా దాడులు జరిపామని వెల్లడించారు. నరేంద్రమోడి ప్రభుత్వం నల్లధనాన్ని వెలికితీయటం తమ ప్రభుత్వ ప్రధాన అజెండాగా ప్రకటించటంతో ఐటీ శాఖ కొంతకాలంగా సోదాలను ముమ్మరం చేస్తోంది. దానిలోనే భాగంగానే చెట్టినాడ్ గ్రూప్‌పై దాడులు జరిపింది.
మరోవైపు, రు.10,000 కోట్ల చెట్టినాడ్ గ్రూప్‌లో అంతర్గత విభేదాలు ఇటీవల భగ్గుమన్నాయి. తన దత్తపుత్రుడు ఎమ్ఏఎమ్ఆర్ ముత్తయ్యను తాను వదులుకుంటున్నట్లు ఛైర్మన్ ఎమ్‌ఏఎమ్ రామస్వామి ఇటీవల ప్రకటించి, అతనిపై క్రిమినల్ కేసుకూడా పెట్టారు. అయితే వారి విభేదాలకు, తమ సోదాలకు సంబంధంలేదని ఐటీ శాఖ అధికారులు చెప్పారు.