ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు పూర్తి బలం ఉన్నప్పటికీ టీడీపీకి మూడు మాత్రమే దక్కుతున్నాయి. మిత్రపక్షాలు అయిన జనసేన, బీజేపీకి చెరో స్థానం కేటాయించాల్సి వచ్చింది. జనసేన పార్టీకి కేటాయించే విషయంలో ఎవరికీ అభ్యంతరాలు లేవు కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం ప్రతీ సారి మాకేంటి అన్నట్లుగా తెరపైకి వస్తోంది. ఇప్పటికే ఆర్ కృష్ణయ్య విషయంలో రాజ్యసభ సీట్ తీసుకున్నారు. విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన సీటులోనూ వారే పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఓ ఎమ్మెల్సీ సీటునూ తీసుకున్నారు.
ప్రతీ సారి భారతీయ జనతా పార్టీకి వాటా
ఉన్న నాలుగు స్థానాల్లో టీడీపీ అధినాయకత్వం సామాజిక న్యాయం, ప్రాంత న్యాయం, పార్టీకి చేసిన సేవల్ని బేరీజు వేసుకుని అభ్యర్థుల్ని ఖరారు చేశారు. ఫలితంగా సీటు హామీ పొందిన పిఠాపురం వర్మ , దేవినేని ఉమ సహా ఎంతో మందికి అవకాశాలు దక్కలేదు. భవిష్యత్ లో చాలా అవకాశాలు ఉంటాయి కానీ.. ఇప్పటికిప్పుడు తమకు ఎందుకు చాన్స్ రాలేదని వారు ఫీలయ్యే అవకాశాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఇలా ప్రతి విషయంలోనూ బలవంతంగా తమ పదవులను తీసుకునే ప్రయత్నం చేయడం వారందర్నీ ఇబ్బంది పెడుతోంది.
త్యాగం చేసిన లీడర్లకు నిరాశ
ఇప్పుడు బీజేపీకి ఎమ్మెల్సీ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఇవ్వాల్సి వచ్చింది. చివరి క్షణం వరకూ బీజేపీ పేరు లేదు. కానీ పై స్థాయి నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు.. స్థానం కేటాయించారు. ఇప్పుడు అభ్యర్థిగా వైసీపీ సానుభూతిపరుడైన నేతను ఎంపిక చేస్తారా లేకపోతే.. బీజేపీ కోసం పని చేసిన వారిని ఎంపిక చేసుకుంటారా అన్నది తేలాల్సి ఉంది. తనకు పదవి కావాలని సోము వీర్రాజు పట్టుబడుతున్నారు. బీజేపీలో సీట్లు త్యాగం చేసేంత బలమైన లీడర్లు ఎవరూ లేరు. కానీ టీడీపీలో చాలా మంది ఉన్నారు. వారిలో చాలా మందికి ఇంకా అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది.
వచ్చే ఐదేళ్లూ ఖాళీ అయ్యే ప్రతీ పదవి కూటమికే !
వచ్చే ఐదేళ్ల పాటు వైసీపీ తరపున ఖాళీ అయ్యే ప్రతి పదవి టీడీపీ కూటమికే వస్తుంది. ఆ పదవులతో పార్టీ నేతల ఆశలు తీర్చవచ్చు. కానీ అప్పటికీ బీజేపీ పోటీ రాదన్న గ్యారంటీ లేదు. కేంద్ర పదవుల్లో అయినా కొన్ని టీడీపీ నేతలకు కేటాయిస్తే కొంత మంది అసంతృప్తిని చల్లార్చినట్లవుతుంది. కానీ అలాంటి సహకారం బీజేపీ నుంచి లభించడం లేదు. త్యాగాలు టీడీపీకి మాత్రమే ఖరారవుతున్నాయి.