సుషాంత్ సింగ్ రాజ్‌పుత్. తెలుగు సినిమాలు చూసేవారికి పెద్దగా తెలియదు. కానీ క్రికెట్ ప్రేమికులందరికీ తెలుసు. ధోనీ బయోపిక్ హీరో. అచ్చం ధోనీలా తనను తాను మార్చుకోవడానికి ఎంత కష్టపడి ఉంటాడో.. ఆ సినిమా చూసిన వారికి సులువుగానే తెలిసిపోతుంది. ఎప్పుడూ నవ్వుతూ ఉండే.. నటుడు. చలాకీగా ఉండే నటుడు. గట్టిగా మూడు పదులు మాత్రమే ఉంటుంది. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా.. గ్రూప్ డ్యాన్సర్ నుంచి అంచెలంచెలుగా హీరోగా ఎదిగిన నటుడు. ఇలా ఎదిగిన నటుడు ఆకస్మాత్‌గా ఆత్మహత్య చేసుకునేంత ఒత్తిడి ఎదుర్కొన్నాడా..? డిప్రెషన్లోకి వెళ్లిపోయాడా..? ప్రాణాలు తీసుకోవడం తప్ప మరో మార్గం లేదన్నంతగా మానసిక కుంగుబాటుకు గురయ్యాడా..? అని.. ఆయన తెలిసిన ప్రపంచం షాక్‌కు గురవుతోంది.
సుశాంత్ సుసైడ్.. బాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు దేశ ప్రజలను కూడా షాక్‌కు గురిచేసింది. అంత ఎత్తుకు ఎదిగి… కెరీర్లో సూపర్ స్టారిజాన్ని అందుకుంటాడని.. అంచనాల్లో ఉన్న వారందర్నీ సుషాంత్ షాక్‌కు గురి చేశాడు. సుషాంత్పై పెద్ద అంచనాల్లేవు. ఆయన బీహార్‌లో ఓ సాధారణ కుటుంబంలో జన్మించాడు. మంచి చదువరి అయినా… షోబిజ్‌లో తన కెరీర్ ఎంచుకోవాలని ముంబై బాట పట్టాడు. అవార్డుల పంక్షన్లలో డాన్సులేశాడు. సీరియళ్లలో నటించాడు. సినిమాలను అందుకున్నాడు. ఈ మధ్యలో ఎంతో ఒత్తిడి ఎదుర్కొని ఉంటాడు. కానీ.. అంతకు మించి ఇప్పుడు డిప్రెషన్ ఏమిటన్నది అర్థం కాని విషయం.
సుషాంత్కు ఆర్థిక సమస్యల్లేవు. ఆయనకు కెరీర్లో పల్లాల్లేవ్. ఇప్పటికీ ఎక్కుతూనే ఉన్నారు. చాన్సుల్లేవనే కారణం కానే కాదు. ఒప్పుకుంటే.. తీరిక లేకుండా సినిమాలు చేయగలిగిన క్రేజ్ ఉంది. అయినా డిప్రెషన్‌కు గురయ్యాడు. బతకడం కంటే చావడం మేలనుకునే స్థాయికి ఒక వ్యక్తి ఒత్తిడిలోకి వెళ్లిపోయినప్పుడు ఇలాంటి తీవ్ర నిర్ణయమే ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. అలాంటి పరిస్థితి ఎందుకొచ్చిందనేదే.. ఇప్పుడు… చాలా మందిని ఆశ్చర్య పరుస్తున్న విషయం.
బాలీవుడ్ తారల లైఫ్ స్టైల్ వేరుగా ఉంటుంది. సక్సెస్ చూసిన వాళ్లది మరింత భిన్నంగా ఉంటుంది. జీవితాన్ని ఎన్నో చుట్టుముడతాయి. అన్నింటినీ మెరుగ్గా డీల్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఎన్నో చేదు ఘటనలూ ఎదురవుతాయి. ఇలాంటి సందర్భాల్లోనే చాలా మంది డిప్రెషన్‌కు గురవుతూంటారు. దీపికా పదుకొనే సహా అనేక మంది ఇలాంటి పరిస్థితుల్ని అనుభవించారు. కానీ వారంతా.. అదే మానసిక బలంతో కోలుకున్నారు. తమ మనసులోంచి ఆత్మహత్య అనే భావనలు తొలగించుకున్నారు. మానసిక ఒత్తిడి నుంచి బైట పడేందుకు ఎన్నో అవకాశాలున్నాయి. ఈ పద్ధతులను చాలా మంది పాటిస్తుంటారు కూడా. అయినా ఒక బలహీన క్షణం వచ్చే సరికి మాత్రం ఒంటరివాళ్లైపోతారు. క్షణకాలం బలహీనతకు లోనై ఆత్మహత్య చేసుకుంటున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ కూడా ఆ బలహీనక్షణం బారిన పడి ఉంటారు..!