ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజన, న్యాయాధికారుల ప్రాధమిక కేటాయింపుని రద్దు చేయాలని కోరుతూ తెలంగాణా రాష్ట్ర న్యాయవాదులు, న్యాయమూర్తులు మొదలుపెట్టిన ఉద్యమం తీవ్రతరం అవడంతో, ఆ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా డిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని యోచిస్తున్నారు.
ఆ విషయం తెలుసుకొన్న కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “హైకోర్టు విభజనలో ఉన్న సమస్యలు, అవరోధాల గురించి అన్నీ తెలిసి ఉన్న తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ కేంద్రప్రభుత్వాన్ని నిందించడం, డిల్లీలో ధర్నాచేయలనుకోవడం మాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. మా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ధర్నాలు చేస్తే ఆయనకి ప్రజలే తగినవిధంగా బుద్ధి చెప్పారు. ఒకవేళ కెసిఆర్ కూడా ధర్నా చేయదలచుకొంటే మేము స్వాగతిస్తాము. హైకోర్టు విభజన మా చేతుల్లో ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో హైకోర్టు ఏర్పాటుకి అవసరమైన ఏర్పాట్లు, మౌలికవసతులు కల్పించవలసిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీదనే ఉంది. కనుక ఈ విషయంలో మేమేమీ చేయలేము. ప్రస్తుతం ఈ అంశం హైకోర్టు పరిధిలో ఉంది కనుక దీని గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను. ఉమ్మడి హైకోర్టులో తలెత్తిన సంక్షోభాన్ని తక్షణమే పరిష్కరించమని కోరుతూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ వ్రాస్తాను,” అని అన్నారు.
సదానంద గౌడ స్పందన తెలంగాణా ప్రభుత్వాన్ని, న్యాయవాదులని ఇంకా రెచ్చగొట్టేదిగా ఉంది తప్ప వారిని శాంతపరిచేదిగా లేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి డిల్లీలో ధర్నా చేస్తానని చెపుతుంటే సమస్య పరిష్కారానికి కృషి చేస్తాననో లేదా ఆ సమస్యలపై చర్చలకి రావాలనో చెప్పి దీక్ష ఆలోచనని విరమింపజేసే ప్రయత్నం చేయకపోగా, దీక్షని స్వాగతిస్తామని, కెసిఆర్ కి కూడా ప్రజలే బుద్ధి చెప్పుతారని, హైకోర్టు విభజన కేంద్రం చేతిలో లేదని సదానంద గౌడ చెప్పడం బాధ్యతారాహిత్యమనే చెప్పవచ్చు.
అరవింద్ కేజ్రీవాల్ దీక్షకి ఆమాద్మీ పార్టీ కార్యకర్తలు తప్ప డిల్లీ ప్రజలు మద్దతు ఈయలేదు. కానీ కెసిఆర్ దీక్ష చేస్తే యావత్ రాష్ట్ర ప్రజలు, న్యాయవాదులు, న్యాయమూర్తులు, చివరికి రాష్ట్రంలో ప్రతిపక్షాలు కూడా మద్దతు ఇస్తాయి. ఎందుకంటే అది యావత్ రాష్ట్ర స్వాభిమానానికి సంబంధించిన సమస్య కనుక. పైగా తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి రెండేళ్ళయినా ఇంకా హైకోర్టుని ఎందుకు విభజించడం లేదు? అనే ప్రశ్నకు కేంద్రం వద్ద సరైన సమాధానమే లేదు. నేటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైపు చూపిస్తున్నారు. కేంద్రం తలుచుకొంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఒప్పించి ఆంధ్రప్రదేశ్ లో హైకోర్టు ఏర్పాటు చేయలేదా? అని ఆలోచిస్తే సాధ్యమేనని ఎవరైనా చెప్పగలరు. కానీ ఆ చిన్న ప్రయత్నం కూడా చేయకుండా కేంద్రం తప్పించుకొనే ప్రయత్నం చేస్తోంది. తెలంగాణా న్యాయవాదుల మొదలుపెట్టిన పోరాటం ఇప్పుడు నానాటికీ తీవ్రతరం అవుతోందే తప్ప తగ్గే సూచనలు కనిపించడం లేదు. తెలంగాణా న్యాయవ్యవస్థలో, హైకోర్టులో జరుగుతున్న పరిణామాలన్నీ కళ్ళారా చూస్తూ కూడా న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ ఈవిధంగా మాట్లాడటం సమంజసం కాదు.