హైకోర్టు విభజనలో జాప్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇంత కాలం సందర్భాన్ని బట్టి కేంద్రంపై అప్పుడప్పుడూ విమర్శలు చేసినా వీలైనంత వరకు సఖ్యతగానే ఉన్నారు. కానీ ఈ విషయంలో మాత్రం తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయడానికి ఆయన సిద్ధమవుతున్నారని స్పష్టమైన సంకేతాలు వెలువడ్డాయి. కేసీఆర్ ఆ పనిచేస్తే అది ప్రపంచ వ్యాప్తంగా మీడియా దృష్టిని ఆకర్షిస్తుంది. మోడీ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతుంది. కాబట్టి ఆ పరిస్థితి రానివ్వ కూడదని ఆయన కుమార్తె, ఎంపీ కవిత కేంద్రాన్ని కోరారు.
కానీ కేంద్రం మరో విధంగా స్పందించింది. ప్రతిదానికీ తమను విమర్శించడం సరికాదని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ ఎదురు దాడి చేశారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాల సమ్మతితోనే హైకోర్టు విభజన జరగాలన్నారు. దీనిపై తాను ఇప్పటికే ఇద్దరు ముఖ్యమంత్రులతో మాట్లాడానని చెప్పారు. న్యాయాధికారు వివాదంలో తమను నిందించడం భావ్యం కాదన్నారు. దిగువ స్థాయి కోర్టుల్లో జడ్జీల నియామకం తమ పరిధిలోనిది కాదన్నారు.
కేసీఆర్ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయాలనుకుంటే ఆయన ఇష్టమని గౌడ చెప్పారు. కానీ ముఖ్యమంత్రిగా ఉంటూ ధర్నా చేయడం ద్వారా ఆయన మరో కేజ్రీవాల్ గా మారవద్దన్నారు. ఒకవేళ అలా మారితే ప్రజలే బుద్ధిచెప్తారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను కేజ్రీవాల్ తో పోల్చడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది.
తెలంగాణ పూర్తి స్థాయి రాష్ట్రమైనా, ముఖ్యమైన ఆదేశాలు జారీ చేయడం తదితర సందర్భాల్లో కేసీఆర్ తప్పనిసరిగా గవర్నర్ ను కలుస్తున్నారు. విషయం వివరిస్తున్నారు. ప్రతి దానికీ గవర్నర్ ఆమోదం అవసరం లేకపోయినా ఆ హోదాను గౌరవిస్తున్నారు. కేజ్రీవాల్ సంగతి వేరు. ఢిల్లీ పూర్తి స్థాయి రాష్ట్రం కాదు. చాలా విషయాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయమే ఫైనల్. అయినా కేజ్రీవాల్ కావాలని తానే ఆదేశాలను జారీచేయడం, వాటిని ఎల్ జి రద్దు చేయడం పరిపాటిగా మారింది. రాజ్యాంగం ప్రకారం అక్కడ ఎల్ జి అధికారాలు ఏమిటో తెలిసి కూడా కేజ్రీవాల్ ప్రభుత్వం ఆయన అనుమతిలేకుండా ఉత్తర్వులు జారీ చేస్తూ కయ్యానికి కాలు దువ్వుతోంది.
కేసీఆర్ ను కేజ్రీవాల్ తో పోల్చడ ముమ్మాటికీ సరికాదని తెలంగాణ వాదుల అభిప్రాయం. సదానంద గౌడ తన విధులు, పరిమితులపై వివరించడం వరకూ సరే. కానీ ఇలంటి వ్యాఖ్యలు చేయడం వల్ల రాజకీయ ఉద్రిక్తతలు పెరగవచ్చు. ఇంతకీ హైకోర్టు విభజనపై కేసీఆర్ ఏం చేస్తారో, దీనిపై కేంద్ర ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందో ఒకటి రెండు రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.