అమరేశ్వర స్వామి ఆలయానికి చెందిన సదావర్తి భూముల కుంభకోణం తెదేపా మెడకి చుట్టుకోబోతోందా? అంటే అవుననే అనిపిస్తోంది. తెదేపా నేతలు కుమ్మక్కై కోట్లు పలికే ఆలయ సత్రవ భూములని కారుచవకగా స్వంతం చేసుకొన్నారని వైకాపా ఆరోపిస్తోంది. ఆ అమ్మకాన్ని తక్షణమే రద్దు చేసి మళ్ళీ బహిరంగ వేలం నిర్వహించాలని కోరుతోంది. తమ డిమాండ్ కి ఒప్పుకొంటే ప్రభుత్వానికి ఇంకా లాభమే తప్ప నష్టం రానప్పుడు ఎందుకు వెనుకాడుతోందని ధర్మాన ప్రసాదరావు ప్రశ్నిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో మంత్రులు, తెదేపా నేతలు చాలా మంది బినామీ పేర్లతో బారీగా భూములు కొని అవినీతికి పాల్పడినట్లు వైకాపా ఆరోపిస్తోంది. దానిని గట్టిగా ఖండించినట్లు ఈ తాజా ఆరోపణలని తెదేపా ఖండించలేకపోతోంది. పైగా మంత్రి రావెల కిషోర్ బాబు ఈ వ్యవహారం గురించి చెప్పిన మాటలు, వైకాపా ఆరోపణలని దృవీకరిస్తున్నట్లున్నాయి. చెన్నై సమీపంలో మహాబలిపురం వద్ద గల సత్రవ భూములు ఆక్రమణకి గురవుతున్న కారణంగానే తక్కువ ధరకి విక్రయించవలసి వచ్చిందని చెప్పారు. ఇక ఈ వ్యవహారం న్యాయస్థానానికి చేరడంతో తన కొడుకు అనవసరంగా ఈ వ్యవహారంలో తల దూర్చాడని కాపు కార్పోరేషన్ చైర్మన్ రామానుజయ్య అన్నారు. ఆయన మాటలు కూడా వైకాపా ఆరోపణలని దృవీకరిస్తున్నట్లుగానే ఉన్నాయి.
ఈ వ్యవహారంపై ద్రోణంరాజు రవికుమార్ అనే వ్యక్తి హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. దానిని విచారణకి స్వీకరించిన హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వారం రోజులలోగా సంజాయిషీ ఇవ్వాలని ఆదేశిస్తూ నోటీసు జారీ చేసింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వ సంజాయిషీ సంతృప్తికరంగా లేదని హైకోర్టు భావిస్తే విచారణకి ఆదేశించవచ్చు. అదే జరిగితే ప్రభుత్వానికి, భూములు కొనుగోలు చేసిన వారికి సమస్యలు ఎదుర్కోక తప్పదు.