ఒకప్పుడు అవిభక్త భారత దేశాన్ని పాలించిన ఇంగ్లండ్ రాజధాని లండన్ లో ఓ పాకిస్తానీ పాగా వేశాడు. పాకిస్తానీ మూలాలుగల సాదిక్ అమన్ ఖాన్ లండన్ మేయర్ గా ఎన్నికయ్యారు. లేబర్ పార్టీ అభ్యర్థిగా ఆయన మంచి మెజారిటీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. 45 ఏళ్ల వయసులోనే ఈ ఘనత సాధించారు.
సాదిక్ పూర్వీకులు దేశ విభజన సమయంలో భారత్ నుంచి పాకిస్తాన్ కు వెళ్లిపోయారు. ఆయన తల్లిదండ్రులు పాకిస్తాన్ నుంచి లండన్ కు వలసపోయారు. వాళ్లు లండన్ వెళ్లిన కొన్నిరోజులకే సాదిక్ జన్మించారు. ఆయన తండ్రి బస్ డ్రయివర్ గా పనిచేశారు. ఇప్పుడు ఇక లండన్ ను తొలి ముస్లిం మేయర్ పాలించబోతున్నాడు.
లేబర్ పార్టీ బలంతో పాటు, ముస్లిం ఓట్ల బలం కూడా ఆయన విజయానికి దోహదపడింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, భారత్ నుంచి లక్షల మంది ముస్లింలు లండన్ వెళ్లి స్థిరపడ్డారు. స్థిర నివాసం లేకపోయినా చదువుకోవడానికి వెళ్లిన వారికి కూడా అక్కడ ఓటు హక్కు లభిస్తుంది. అలా పెద్ద సంఖ్యలో ముస్లింలు గంపగుత్తగా ఆయనకే ఓటు వేశారని ఫలితాల సరళి చెప్తోంది.
ఈ ఎన్నికల ఫలితం ఐరోపా దేశాల్లో చాలా మందికి విస్మయం కలిగించింది. పారిస్ దాడులు, అంతకు ముందు లండన్ పేలుళ్ల ఘటనతో జీహాదీ తీవ్రవాదమంటేనే ఐరోపా వాసులు వణికిపోతున్నారు. ఎలాగైనా దీనికి చెక్ పెట్టాలని భావిస్తున్నారు. పారిస్ ఉగ్రవాద దాడి తర్వాత జీహాదీ గ్రూపుల స్లీపర్ సెల్స్ కోసం ముమ్మరంగా వేటాడుతున్నారు. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ ఎయిర్ పోర్ట్, మెట్రో రైల్వే స్టేషన్ లో దాడుల తర్వాత ఐరోపాలో అప్రమత్తత పెరిగింది. జీహాదీ తీవ్రవాదం పట్ల, కొన్ని చోట్ల ముస్లిం పట్ల వ్యతిరేకత కూడా పెరిగింది.
తాము లండన్ ను టార్గెట్ చేయబోతున్నామని ఐసిస్ ఉగ్రవాదులు ఇటీవల అనేక సార్లు బెదిరింపు ప్రకటనలు చేశారు. అమెరికాతో పాటు ఇంగ్లండ్ ను నాశనం చేస్తామని శపథం చేశారు. దీంతో ముస్లింల ప్రవేశంపై ఆంక్షలు విధించాలనే డిమాండ్లు కూడా కొన్ని చోట్ల వినిపస్తున్నాయి. అలాంటి సమయంలో ఒక ముస్లింను, చరిత్రాత్మక లండన్ మేయర్ గా ఎన్నుకోవడం గొప్ప విశేషం. జీహాదీ ఉగ్రవాదులు వేరు, సగటు ముస్లింలు వేరు అని లండన్ ప్రజలు భావించారని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
ఈ ఫలితం వల్ల పాకిస్తానీ ముస్లింల ప్రాబల్యం ఇంగ్లండ్ లో పెరిగే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. అయితే, ఈ పరిణామం ఇంగ్లండ్ భద్రతకు ముప్పుగా మారే ప్రమాదం ఉందనే వారూ ఉన్నారు. అలాంటి వారు పెద్ద ఎత్తున సాదిక్ కు వ్యతిరేకంగా ఓటు వేశారు. అయినా లండన్ లోని మెజారిటీ ఓటర్లు మాత్రం ముస్లిం మేయర్ ను ఎన్నుకోవడానికే మొగ్గు చూపారు. ఆయనకు వచ్చిన ఓట్లలో ముస్లిం ఓట్లతో పాటు ఓ మోస్తరుగా స్థానికుల ఓట్లు కూడా ఉన్నాయంటున్నారు లేబర్ పార్టీ నేతలు. సాదిక్ విజయంతో పాకిస్తాన్ లో సంబరాలు చేసుకుంటున్నారు. మనోడు మేయర్ అయ్యాడని పండగ చేసుకుంటున్నారు.