చాలా కాలం తరవాత ప్రేమమ్ ద్వారా ఓ హిట్ అందింది నాగ చైతన్యకి. ఆసినిమాలో నాగార్జుననీ, వెంకటేష్‌నీ బాగా వాడుకొన్నాడు. సైకిల్ చైన్ పట్టుకొని శివ సినిమాని గుర్తు చేశాడు. సైకిల్ చైన్‌పై అన్నీ రైట్స్ మావే అనే డైలాగ్ చెప్పి… ఫ్యాన్స్ చేత ఈలలు వేయించాడు. ఇదే ట్రెండ్ సాహసం శ్వాసగా సాగిపో సినిమాకీ కొనసాగించబోతున్నాడు నాగచైతన్య. అనేక వాయిదాలు పడుతూ… ఎట్టకేలకు ఇప్పుడు మరోసారి విడుదలకు సిద్దమైందీ చిత్రం. నవంబరు 2వ వారంలో సాహసం శ్వాసగా సాగిపోని విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్రబృందం.
లవ్ లెటర్లు రాయడం, అమ్మాయిల వెనుక పడడం శివ సినిమా టైమ్ లో.. ఇప్పుడు వాళ్లబ్బాయి కూడా హీరో అయిపోయాడు.. అనే డైలాగ్‌తో ఈ ట్రైలర్ మొదలవుతుంది. అంటే.. ఈ సినిమాలోనూ నాగ్, శివ సినిమాల భజన ఉంటుందని సంకేతాలు ఇచ్చేశారన్న మాట. ప్రేమమ్ సినిమా ఎఫెక్టో ఏమో.. ఇదో యాక్షన్ థ్రిల్లర్ అయినా సరే, లవ్ ట్రాక్‌కి సంబంధించిన షాట్లే ఎక్కువ కట్ చేశారు. హీరో పేరుని దాచేస్తూ.. ఓ థీమ్ ప్రకారం ఈ ట్రైలర్ కట్ చేసినట్టు అనిపిస్తోంది. హీరో పేరుకీ, ఈ సినిమా కథకీ ఏదో లింకుందన్నమాట. మొత్తానికి గౌతమ్ మీనన్ స్టైల్ ఆఫ్ మేకింగ్ ఈ సినిమాలో బాగానే కనిపించిందీ, వినిపించింది. లేట్‌గా వస్తూ, ఆకర్షణ కోల్పోయిన ఈ సినిమాని ఆదుకోవాల్సింది అదే.