టక్ జగదీష్‌ని ఓటీటీలో విడుదల చేయడం చాలామందికి నచ్చలేదు. నాని కూడా ఈ సినిమాని థియేటర్లలోనే విడుదల చేయాలని పోరాడాడు. కానీ ఫలితం లేకుండా పోయింది. నిర్మాతల ఒత్తిడితోనే ఈసినిమాని ఓటీటీకి ఇవ్వాల్సివచ్చింది. ఈనెల 10న టక్ జగదీష్ అమేజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. అయితే ఈ సినిమాని ఓటీటీకి ఎందుకు ఇవ్వాల్సివచ్చిందన్న విషయంలో నిర్మాత సాహు గారపాటి క్లారిటీ ఇచ్చారు.
”థర్డ్ వేవ్ భయాలు వెన్నాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మా సినిమాని థియేటర్లో విడుదల చేయడం చాలా పెద్ద రిస్క్. వకీల్ సాబ్ రిలీజ్ అయి మంచి టాక్ తో నడుస్తున్నప్పుడు సెకండ్ వేవ్ ఉధృతమైంది. సడన్ గా థియేటర్లు మూసేశారు. అలాంటి పరిస్థితి మళ్లీ వస్తే ప్రమాదమే. పైగా పక్క రాష్ట్రాలలో సింగిల్ స్క్రీన్లు ఇంకా ఓపెన్ చేయలేదు. ఓవర్సీస్ లో అయితే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఏపీలో మూడు షోలే నడుస్తున్నాయి. ఎవరినో ఇబ్బంది పెట్టాలని ఓటీటీకి ఇవ్వలేదు. నిజానికి.. ఓటీటీకి ఇవ్వడం వల్ల మాకే నష్టం. థియేటర్ రెవిన్యూ ఓటీటీ నుంచి రాదు. జాతిరత్నాలు, ఉప్పెన ఎంత వసూలు చేశాయో చూశారు కదా..? ఏ హీరోకైనా, దర్శకుడికైనా, నిర్మాతకైనా తన సినిమాని ప్రేక్షకులకు చూపించుకోవాలని ఉంటుంది. ఈ సినిమా ఎప్పుడో పూర్తయ్యింది. పరిస్థితులు బాగుపడతాయని ఎదురు చూశాం. ఇంకా ఎక్కువ రోజులు హోల్డ్ చేయడం ఇష్టం లేదు. అందుకే ఓటీటీకి ఇచ్చాం. `టక్ జగదీష్` కుటుంబం అంతా కలసి చూడాల్సిన సినిమా. వాళ్లంతా పండగ రోజున ఇంట్లో కూర్చుని ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయాలన్నదే ఆశ” అన్నారు.