కనిపించరు గానీ… రాంగోపాల్ వర్మని మించిన పబ్లిసిటీ మొనగాళ్లు మనకు చాలామంది కనిపిస్తుంటారు. ఒక వ్యక్తిని గానీ, న్యూస్‌ని గానీ, వివాదాన్ని గానీ… ఎలా వాడుకోవాలో ఎంత వాడుకోవాలో వర్మే మిగిలిన వాళ్లకు నేర్పించాడేమో. ఇప్పుడు కొంతమంది వర్మ కంటే తోపుగాళ్లు తయారయ్యారు. మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్‌ని వాడుకోవడంలో వాళ్ల మైండ్ అంతా వాడేస్తున్నారు. నితిన్‌తో మొదలెడితే.. సప్తగిరి వరకూ పవన్‌ని వాడుకోనివాళ్లు లేరు. ‘నాకు పవన్ అంటే ఇష్టం’ అంటే చాలు. ఫోకస్ పెరుగుతుంది. అటెన్షన్ మొదలైపోతుంది. అంతో ఇంతో పబ్లిసిటీ ఫ్రీగా దక్కుతుంది. బయటి హీరోలే పవన్‌ని ఎడాపెడా వాడేస్తుంటే, మన మెందుకు వాడుకోకూడదు? అంటూ మెగా హీరోలూ రెచ్చిపోతున్నారీమధ్య. అల్లు అర్జున్ నుంచి పవన్ కల్యాణ్ మాట వినిపించడం బాగా తగ్గిపోయింది. దానికి సవాలక్ష కారణాలున్నాయి. అయితే.. మిగిలినవాళ్లు సౌండ్ బాగానే వినిపిస్తున్నారు. బ్రూస్లీ సినిమాకి ముందు పవన్ బాబాయ్‌ని వాడుకొన్నాడు చరణ్. ధృవ లో ఆ తాకిడి బాగా తగ్గింది. సాయిధరమ్ తేజ్ అయితే… ప్రతీ సినిమాకీ పవన్ పేరు వాడుకోవడం అలవాటు చేసుకొన్నాడు. తాజా సినిమా విన్నర్కీ అది కంటిన్యూ అయ్యింది. గెలుపంటే ఏంటో చెప్పింది కల్యాణ్ మామే.. అంటూ స్టేట్మెంట్ ఇస్తే – మీడియా దాన్ని పతాక శీర్షికన తీసుకెళ్లి కూర్చోబెట్టింది.
తేజుకి కావల్సిందీ అదే. పవన్ కోసం చెప్పిన మాట హైలెట్ అవ్వాలి. దాంతో తనపై ఫోకస్ పెరగాలి. పవన్ ఫ్యాన్స్ వల్ల టికెట్లు తెగాలి. ఇంతకు మించి ఆశించిందేం లేదు. నిజంగా పవన్‌పై ప్రేమ ఉంటే.. మిగిలిన రోజుల్లో పవన్ గురించి ఎందుకు మాట్లాడలేదు. జనసేన గురించి అంత చర్చ జరుగుతున్నప్పుడు ఎందుకు పెదవి విప్పలేదు. పవన్ ఒంటరిగా పోరాడుతుంటే.. ఎందుకు మద్దతివ్వలేదు. సాయిధరమ్ ఒక్కడే అని కాదు. మిగిలిన వాళ్లూ అంతే. రేప్పొద్దుట మిస్టర్ సినిమా వస్తుంది. అప్పుడు వరుణ్ తేజ్ కూడా ఇలాంటి స్టేట్మెంటే ఒకటి ఇస్తాడు. దాంతో మిస్టర్ పబ్లిసిటీకి అది ప్లస్ అవుతుంది. సినిమా వచ్చి, ఆడి, వెళ్లిపోయాక అంతా మామూలే. వాడుకొన్నవాళ్లకు వాడుకొన్నంత అనేలా పవన్ పేరు తయారైంది. అయితే.. పవన్ ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంలో కాస్త అలెర్ట్‌గానే ఉన్నారు. ఏది మనసులోంచి వస్తున్న మాట.. ఏది పబ్లిసిటీ కోసం అనేది తెలీనంత వెర్రోళ్లయితే కాదు. మెగా ఫ్యాన్స్‌కీ.. పవన్ ఫ్యాన్స్‌కీ మధ్య ఓ స్పష్టమైన గీత ఏర్పడిందన్న మాట నిజం. దాన్ని సాయిధరమ్, వరుణ్‌తేజ్ లాంటి వాళ్లు పెద్దది చేయడం లేదు. అలాగని చెరిపేసే ప్రయత్నాలూ చేయడం లేదు. ఏ బన్నీనో, చరణో… ఐ యామ్ విత్ పవన్ అంటే తప్ప – ఆ గీత అలానే ఉంటుంది. మధ్యలో ఇలాంటి సిల్లీ స్టేట్మెంట్లు ఎన్ని ఇచ్చినా విలువ లేదు.