సినిమా విడుదలైన… నెల రోజుల వరకూ ఆ సినిమా ఇంకా హిట్టే అన్న భ్రమల్లో ఉంటారు హీరోలు. ‘సినిమా బాగుంది.. రెస్పాన్స్ అదిరిపోయింది.. స్లోగా పికప్ అయ్యింది’ అంటూ రకరకాల బిల్డప్పులు ఇస్తుంటారు. కానీ సాయిధరమ్ తేజ్ మాత్రం నిజాయతీగా… తన సినిమా ఫ్లాప్ అని ఒప్పుకొన్నాడు. సాయిధరమ్ నటించిన తాజా చిత్రం ‘తిక్క’. పేరుకు తగ్గట్టే కథ, కథనాల్ని తీర్చిదిద్దడంలో తన తిక్కంతా చూపించేశాడు దర్శకుడు. అందుకే ఈ సినిమా డిజాస్టర్ లిస్టులో చేరిపోయింది. ఇప్పుడు సాయిధరమ్ కూడా తప్పు చేశానని ఒప్పుకొన్నాడు. ఓ టీవీ ఛానల్‌కి ఇచ్చిన లేటెస్ట్ ఇంటర్వ్యూలో సాయిధరమ్‌తేజ్ మనసు విప్పి మాట్లాడాడు.
”ఇప్పటి వరకూ నేను చేసినవన్నీ కమర్షియల్ సినిమాలే. ‘తిక్క’ కథ చెప్పినప్పుడు డిఫరెంట్ గా ఫీలయ్యా. బ్రేకప్ అయిన ఓ కుర్రాడు ఏం చేశాడన్న పాయింట్ ఆసక్తిగా అనిపించింది. కొత్తగా ఏమైనా చేస్తేనే కదా తప్పొప్పులు తెలిసేది. ఈ సినిమా నుంచి నేను చాలా నేర్చుకొన్నా. ఆ విధంగా తిక్క సినిమా నాకు ఉపయోగపడింది” అంటూ తన ఓటమిని అంగీకరించాడు సాయి. అలాగని కొత్త కథల్ని ఎంచుకోవడం మానడట. చేసిన సినిమాలే చేస్తే బోర్ కొడుతుందని, అందుకే కొత్తగా ప్రయత్నించాలని చెబుతున్నాడు. ఈ కామెంట్లతో సాయిధరమ్లోని సిన్సియారిటీ కనిపించినా.. దర్శక నిర్మాతలు మాత్రం నివ్వెరపోయారు. ఓ పక్క థియేటర్లలో సినిమా ఆడుతుంటే.. మన సినిమా మనమే ఫ్లాప్ అని చెప్పుకోవడం ఏమిటని తెగ ఫీలవుతున్నార్ట.