హీరో సాయి ధరమ్ తేజ్ హైదరాబాద్లోని కేబుల్ బ్రిడ్జిపై ప్రమాదానికి గురయ్యారు. ఆయన తన స్పోర్ట్స్ బైక్పై జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 45 నుంచి గచ్చి బౌలి వైపు వెళ్తున్న సమయంలో బైక్ స్కిడ్ అయినట్లుగా తెలుస్తోంది. వేగంగా వెళ్తున్న బైక్ ఒక్క సారిగా స్కిడ్ కావడంతో సాయిధర్మతేజ్ పడిపోయారు. దీంతో ఆయనకు కుడి కన్ను పైన, అలాగే చాతి భాగంలో బలమైన ఒత్తిడికి గురయిన గాయాలు ఉన్నాయి. పొట్ట భాగంలోనూ శరీరం ఒత్తిడికి గురయినట్లుగా తెలుస్తోంది. పైకి భారీ గాయాలు కనిపించడం లేదు.
కానీ ఆయన ప్రమాదం జరిగిన వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. పోలీసులు వెంటనే హుటాహుటిన సమీపంలోని మెడికవర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చిన తర్వాత అపోలోకు మార్చినట్లుగా తెలుస్తోంది. అంతర్గతంగా ఏమైనా గాయాలయ్యాయేమో డాక్టర్లు స్కాన్ చేసి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. సాయి ధరమ్ తేజ్ నెమ్మదైన వ్యక్తిగానే ఇండస్ట్రీలో అందరికీ తెలుసు, ఆయన రాష్ డ్రైవింగ్ చేయడం లాంటివేమీ ఉండవని అంటారు.
అలాంటి హీరో ఒక్క సారిగా ప్రమాదానికి గురయినట్లుగా తెలియడంతో ఇండస్ట్రీ వర్గాలు కూడా దిగ్భ్రాంతికి గురయ్యాయి. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. సామాజిక అంశాలపై కూడా స్పందిస్తూ.. మెచ్యూర్డ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు.