మెగా హీరో సాయిధరమ్ తేజ్… చేసింది నాలుగే సినిమాలు. అందులో ఒకటి హిట్టు, ఇంకోటి యావరేజు. మరోటి ఫ్లాపు. ఇప్పుడు సుప్రీమ్ వచ్చింది. ఈ సినిమాకీ ముందు డివైడ్ టాక్ నడిచింది. కానీ వేసవి కావడం, పెద్ద సినిమాలు పోటీలో లేకపోవడం, ఫస్టాఫ్ సరదాగా సాగడంతో సుప్రీమ్ గట్టెక్కేశాడు, దిల్ రాజు నమ్మకాన్ని నిలబెట్టాడు. రూ.14 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా ఇది. రిలీజ్‌కి ముందే రూ.24 కోట్ల బిజినెస్ జరిగింది. ఇప్పుడు రూ.20 కోట్ల షేర్ సాధించింది. అక్కడక్కడా బయ్యర్లు స్వల్ప నష్టాల్ని చవిచూసినా.. అవేం పెద్దగా లెక్కలోనికి రాని వ్యవహారాలే. సాయిధరమ్‌కి రూ.20 కోట్ల మార్కెట్ ఉందని ఈ సినిమాతో నిరూపితమైంది. ఫర్లేదు… సాయితో రూ.20 కోట్లు పెట్టి సినిమా తీయొచ్చన్నమాట.
సినిమా సినిమాకీ సాయి తన స్టామినా పెంచుకొంటున్నాడు. సుప్రీమ్‌తో మాస్ హీరోగా దాదాపుగా నిలబడిపోయినట్టే. ఈ దశలో ఇంకో హిట్ పడితే చాలు సాయి ఎక్కడికో వెళ్లిపోతాడు. అయితే ఈ దశలోనే జాగ్రత్తగా ఉండాలి. వరుస హిట్ల హ్యాంగోవర్ తలకెక్కించుకొంటే, మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. తొలి మూడు సినిమాలూ దిల్‌రాజు బ్యానర్లోనే చేయడం వల్ల, చాలా తక్కువ రెమ్యునరేషన్‌కి పనిచేయాల్సివచ్చింది. ఈసారి ఎలాగైనా భారీ పారితోషికం తీసుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు సాయి. 20 కోట్ల హీరోకి నిర్మాతలు ఎంతిస్తారో మరి.