రోడ్డు ప్రమాదంలో సాయిధరమ్ తేజ్ గాయపడి, కోలుకొని మళ్లీ సినిమాలు చేయగలుగుతున్నాడు. అయితే… ఈ ప్రయాణంలో ఎన్నో కష్టనష్టాల్ని అనుభవించాడు. సెట్లోకి అడుగుపెట్టినా, ఇది వరకటి… ఉత్సాహం లేదు. కనీసం మాట కూడా బయటకు రాలేదు. సెట్లో గొంతు పెగల్చడానికి చాలా ఇబ్బంది పడాల్సివచ్చింది. కొన్నిసార్లు నోట మాట రాక..పెదాలు కలిపి, ఎడ్జెస్ట్ చేశాడు. అందుకే ప్రమాదం వల్ల ‘మాట’ విలువేంటో తెలిసిందంటున్నాడు తేజ్.
”సెట్లో చాలా కష్టంగా ఉండేది. మాట వచ్చేది కాదు. నా తోటి నటీనటులు ఇచ్చిన సహకారం వల్ల.. నెమ్మదినెమ్మదిగా మాట్లాడగలిగేవాడ్ని. డబ్బింగ్ సమయంలోనూ చాలా కష్టపడ్డా. ఈ ప్రమాదం వల్ల నాకు మాట విలువ తెలిసొచ్చింది” అని చెప్పుకొచ్చాడు తేజ్. ‘బ్రో’ సినిమా తన జీవితానికి ఓ లైఫ్ టైమ్ ఎచీమెంట్ గా భావిస్తున్నాడు తేజ్. “నాకు కల్యాణ్ మావయ్య అంటే చాలా ఇష్టం. ఆయన నా కెరీర్‌కి చాలా సహాయం చేశారు. నేను ఆయన్ని గురువుగా భావిస్తా. ఆయనతో కలిసి నటించడం నా కెరీర్‌కి ఓ ట్రిబ్యూట్‌లా అనిపించింది. తొలి రోజు ఆయనతో కలిసి నటిస్తున్నప్పుడు చాలా కంగారు పడ్డా. ‘మావయ్యనే కదా. కంగారెందుకు’ అని భుజం తట్టారు. ఆ తరవాత.. ఈజీగానే నటించేశాను” అని బ్రో అనుభవాల్ని కుమ్మరిస్తున్నాడు. ముగ్గురు మావయ్యలతో కలిసి నటించడం తన కల అట. నాగబాబుతో ఇది వరకే నటించాడు. ఇప్పుడు పవన్ కల్యాణ్ కోటా అయిపోయింది. ఇక చిరంజీవితో కలిసి నటించడమే మిగిలి ఉంది.