మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు చెబుతున్న మాటలను బట్టి చూస్తే సాయిధరమ్ తేజ్ తెలిసే ప్లాప్ సినిమాలు చేశాడని అనుకోవాలి. ‘తిక్క’ నుంచి ‘ఇంటిలిజెంట్’ వరకూ వరుసగా ఐదు ప్లాప్ సినిమాలు చేశాడు తేజు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ (నక్షత్రం), కమర్షియల్ డైరెక్టర్స్ వీవీ వినాయక్ (ఇంటిలిజెంట్), గోపీచంద్ మలినేని (విన్నర్), కెరీర్లో చెప్పుకోదగ్గ విజయాలు లేని డైరెక్టర్స్ సునీల్ రెడ్డి (తిక్క), బీవీఎస్ రవి (జవాన్) అందరూ తేజూకి ప్లాపులు ఇచ్చాడు. ఒక్కో సినిమా తేడా కొడుతున్నప్పుడు ఏ హీరో అయినా సరే కెరీర్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని అనుకుంటారు. కానీ, సాయిధరమ్ తేజ్ మాత్రం ఇచ్చిన మాటకు కట్టుబడి సినిమాలు చేశాడట! అరవింద్ గారు ‘తేజ్… ఐ లవ్ యు’ రిలీజ్ ఫ్రెస్మీట్లో చెప్పిందిఅదే. తేజూని ఓసారి కలసినప్పుడు ఒక ప్లాప్ సినిమా గురించి ప్రస్తావించగా… ఆ సినిమా పోతుందని తనకు ముందే తెలుసునని, మాటిచ్చాను కాబట్టి చేశానని సాయిధరమ్ తేజ్ చెప్పారని అల్లు అరవింద్ సెలవిచ్చారు. మొత్తానికి ప్లాప్ సినిమాల ఫలితం దర్శకలు నిర్మాతలదే అన్నట్టు మాట్లాడారు. హిట్ సినిమాల క్రెడిట్ తమకు, ప్లాప్ సినిమాల క్రెడిట్ ఇతరులకు అన్నమాట!!