”నాకు ఈ సినిమా జాతకం ముందే తెలుసు… ఫ్లాప్ అవుతుందని అప్పుడే ఊహించాను” లాంటి డైలాగులు తరచూ వింటూనే ఉంటాం. సినిమా రంగంలో ఎంతో అనుభవం ఉన్న నాగార్జున లాంటి వాళ్లు ఇలాంటి కామెంట్లు చేస్తే వినడానికి బాగుంటుంది. ‘పోనిలే.. ఏదో మొమమాటం కొద్దీ చేశాడులే’ అనుకోవొచ్చు. సాయిధరమ్ తేజ్ లాంటి వాళ్లు కూడా ఇలాంటి కామెంట్లు విసిరితే ఎలా?? తేజూ ఈమధ్య తెగ ఫ్లాపులొచ్చాయి. తనలో ఉన్న టాలెంట్కీ, స్టామినాకీ, ఈజ్ కీ తగిన సినిమా ఏదీ రాలేదు. ‘పాపం.. కష్టపడుతున్నా.. ఫలితం రావడం లేదు’ అని ఫ్యాన్స్ తెగ ఇదైపోతున్నారు. తేజూ మాత్రం `నాకు ఆ సినిమాలు ఫ్లాప్ అవుతాయని ముందే తెలుసు. కానీ నిర్మాతలకు ఇచ్చిన మాట వల్ల చేయాల్సివచ్చింది` అంటూ వీర లెవిల్లో స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. నిజానికి… ఇలాంటి కామెంట్లు యంగ్ హీరోలు చేయకూడదు. ఫ్లాప్ అని తెలిస్తే… ఆసినిమాని వదులుకోవాలి. లేదంటే నిర్మాతల్ని హెచ్చరించాలి. రిపేర్లు గట్రా చేసుకోవాలి. అంతే తప్ప… సినిమా చేసేసి, `నాకు ముందే తెలుసు` లాంటి డైలాగులు కొట్టడం ఎంత వరకూ కరెక్ట్? అలా ముందే తెలిసినప్పుడు ఆ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్లలోనూ, ఇంటర్వ్యూలలోనూ.. ‘ఈ సినిమా మనసు పెట్టి చేశా. కచ్చితంగా హిట్టవుతుంది’ అని డబ్బాలు కొట్టుకోవడం ఎందుకు? రేపటి నుంచి తేజూ ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తే జనం నమ్ముతారా? తన క్రెడిబులిటీ ఏమైపోతుంది? ఇలాంటి విషయాలేం ఆలోచించకుండా స్టేట్మెంట్లు పారేస్తే… ఎలా? తేజూ ఇలాంటి కామెంట్లు ఇచ్చేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి మరి.