సాయిధరమ్ తేజ్ – దేవాకట్టా కాంబినేషన్ లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి `రిపబ్లిక్` అనే టైటిల్ ఖరారు చేశారు. ఈరోజు మోషన్ పోస్టర్ కూడా విడుదల చేశారు. “యువరానన్ ప్రజలు ఎన్నుకున్న రాజకీయ నాయకులు, శాసనాన్ని అమలు చేసే ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయాన్ని కాపాడే కోర్టు. ఈ మూడు గుర్రాలూ ఒకరి తప్పుల్ని ఒకరు సరిదిద్దుకుంటూ, క్రమ బద్ధంగా సాగినప్పుడే అది ప్రభుత్వం అవుతుంది. అదే అసలైన రిపబ్లిక్“ అంటూ తేజ్ చెప్పిన డైలాగ్ ని మోషన్ పోస్టర్ కి జోడించారు. దేవాకట్టా కథలన్నీ సామాజిక నేపథ్యంలో సాగుతుంటాయి. `రిపబ్లిక్` అనే టైటిల్, ఇందులోని డైలాగ్ ని బట్టి చూస్తే… దేవా కట్టా మళ్లీ తనదైన దారిలోనే వెళ్లినట్టు స్పష్టం అవుతోంది. ఇదో రాజకీయ వ్యంగాస్త్రం అన్న సంగతి అర్థమవుతోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న సినిమా ఇది. ఈ వేసవిలో విడుదల చేయనున్నారు.