ప్రస్థానం సినిమాతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు దేవాకట్టా. తన కథల్లో ఓ సామాజిక కోణం ఉంటుంది. ఇప్పుడు `రిపబ్లిక్` అనే సినిమా తీస్తున్నాడు. ఆ టైటిల్ లోనే.. ఇది పొటిలికల్ డ్రామా అనే సంగతి అర్థం అవుతుంది. ప్రస్తుత రాజకీయాల చుట్టూ ఈ కథ తిరుగుతుందన్న హింటు ఆమధ్య విడుదల చేసిన మోషన్ పోస్టర్ ద్వారా ఇచ్చేశాడు.
అయితే ఈ సినిమా కథలో ఓ కీ పాయింట్ ఉందట. అదేంటంటే.. ఈ సినిమాకి బ్యాక్ డ్రాప్… కొల్లేటి సరస్సు అని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని లక్ష ఎకరాల్లో వ్యాపించి ఉన్న సహజసిద్ధమైన సరస్సు ఇది. అనేక పక్షులకు, చేపలకు కొల్లేటి సరస్సు ఆసరా. వేలాది మంది ఈ సరస్సుపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయితే ఇది క్రమంగా ఆక్రమణలకు గురవుతోంది. కొల్లేటి చుట్టూ ఎన్నో రాజకీయాలు నడిచాయి. నడుస్తున్నాయి. దేవాకట్టా దీని చుట్టూనే కథ అల్లాడని తెలుస్తోంది. గతంలో రౌడీ ఫెలో అనే ఓ సినిమా వచ్చింది. అందులో కొల్లేటి సరస్సు అనేది ఓ పాయింట్. కానీ.. డీప్ గా చెప్పలేదు. ఈసారి మాత్రం… కథంతా దీని చుట్టూనే తిరగబోతోందని టాక్. సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.