డబ్బింగ్ ఆర్టిస్టుగా తన సినీ జీవితానికి శ్రీకారం చుట్టి.. ఆ తరవాత నటుడిగా, హీరోగా, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ రెగ్యులర్ టచ్‌లో ఉంటున్నాడు.. సాయికుమార్. సాయి నటన, తన డైలాగ్ డెలివరీ, మేనరిజం ఇవన్నీ ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టవు. అందుకే… తన చేతి నిండా సినిమాలు ఉంటుంటాయి. ఇప్పుడు ఆర్పీ పట్నాయక్ దర్శకత్వం వహించిన మనలో ఒకడు సినిమాలోనూ తనకో మంచి క్యారెక్టర్ పడింది. న్యూస్ ఛానల్ ఎండీ పాత్రలో కనిపించనున్నాడు సాయికుమార్. ఈ సినిమా ఈ శుక్రవారం విడుదల అవుతుంది. మీడియా నేపథ్యంలో నడిచే సినిమాలో నటించడమో ఏమో… ఎప్పటికైనా కనీసం ఒక్క రోజైనా మీడియాలో పనిచేయాలని వుందంటూ ఓ వింత కోరిక బయటపెట్టాడు.
”నాకు టీవీ ఛానళ్లంటే గౌరవం. న్యూస్ ఛానళ్లు చూడడం నా కాలక్షేపాల్లో ఒకటి. మీడియా బలం ఏంటో నాకు తెలుసు. కనీసం ఒక్కరోజైనా మీడియాలో పనిచేయాలని వుంది. అదీ న్యూస్ రీడర్‌గా. బుల్లి తెర ప్రేక్షకులకు వార్తలు చదువుతూ నా గొంతు వినిపిస్తా..” అంటున్నాడు సాయికుమార్. ప్రస్తుతం మీడియా బాగానే పనిచేస్తోందని, ఇంకాస్త నిస్పక్షపాత ధోరణి అవలంభిస్తే బాగుంటుందని సూచిస్తున్నాడీ సీనియర్ నటుడు. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉండడంతో… న్యూస్‌రీడర్ గురించి పెద్దగా ఆలోచించే అవకాశం ఉండకపోవొచ్చు. ఒకవేళ సాయికి అకాశాలు తగ్గితే… అప్పుడు సాయి కోరిక తీర్చడానికి టీవీ ఛానళ్లన్నీ సిద్దంగా ఉంటాయనడంలో సందేహం లేదు.