ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథని చిరంజీవితో చేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు పరుచూరి బ్రదర్స్. చిరు 150వ సినిమాగా ఉయ్యాలవాడని పట్టాలెక్కించాలని శతవిధాలా ప్రయత్నించారు. కాకపోతే అప్పుడున్న సమీకరణాల దృష్ట్యా చిరు పెద్దగా రిస్క్ చేయదలచుకోలేదు. బాహుబలి, గౌతమి పుత్ర ఇచ్చిన స్ఫూర్తితోనో ఏమో.. ఉయ్యాలవాడపై దృష్టి పెట్టాడు చిరు. ఇప్పుడు అదే ‘సైరా నరసింహారెడ్డి’గా మొదలైంది. ఖైది నెం.150 విడుదలైన రెండు నెలలకే సైరా పట్టాలెక్కాల్సింది. కాకపోతే ఈ కథని చిరు ఆషామాషీగా తీసుకోలేదు. చేస్తే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లోనే చేయాలని గట్టిగా ఫిక్సయిపోయాడు. ఇప్పుడు సైరా టీమ్ చూస్తుంటే చిరు ఆలోచనలకు అనుగుణంగా ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నట్టు అర్థం అవుతోంది. స్క్కిప్టు విషయంలోనూ చిరు పక్కా క్లారిటీగా ఉన్నాడు. నిజానికి కథ, మాటలు ఎప్పుడో రెడీ అయిపోయాయి. చిన్న చిన్న మార్పులు చేసుకొంటూ చాలు. కానీ చిరు మాత్రం ఈ కథని పరుచూరి బ్రదర్స్ ఫ్లేవర్లోంచి బయటకు తీసుకురావాలనుకొన్నాడు. అందుకే.. భూపతిరాజా, సత్యానంద్ లాంటి వాళ్లని రంగంలోకి దించాడు.
అంతే కాదు.. పరుచూరి వాళ్లు రాసిన సంభాషణల్ని పూర్తిగా పక్కన పెట్టి బుర్రా సాయి మాధవ్‌కి ఆ బాధ్యతలు అప్పగించాడు. కృష్ణం వందే, గౌతమి పుత్ర సినిమాల్లో బుర్రా రాసిన డైలాగులు డైనమైట్లలా పేలాయి. ఈ సినిమాకీ అలాంటి మాటలే అవసరం. అందుకే.. పరుచూరి వారి మార్క్ కనిపించకుండా ఉండాలంటే బుర్రానే రైట్ ఆప్షన్ అనిపించింది చిరుకి. ”అన్ని విషయాలూ దగ్గరుండి చూసుకోండి.. డైలాగులు మాత్రం బుర్రాకి వదిలిపెట్టండి” అంటూ పరుచూరి సోదరులకు నిర్మొహమాటంగా చెప్పాడట చిరు. సాయిమాధవ్ డైలాగుల్లో చిన్న చిన్న కరక్షన్లు తప్ప… కంటెంట్‌ని మార్చడానికి వీల్లేదని క్లారిటీగా చెప్పేశాడట. దాంతో పరుచూరి వారి కలానికి ఈ సినిమాలో పని దొరక్కుండా పోయినట్టైంది.