చిరంజీవి – వశిష్ట కాంబినేషన్లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలే క్లాప్ కొట్టారు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. సంభాషణలు రాసే బాధ్యత బుర్రా సాయిమాధవ్ కి అప్పగించారు. చిరు నటించిన ఖైదీ నెం.150, సైరా చిత్రాలకు బుర్రా సంభాషణలు అందించారు. ఇది మూడో సినిమా అవుతుంది. సోషియో ఫాంటసీ నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఈ చిత్రానికి `విశ్వంభర` అనే పేరు పరిశీలనలో ఉంది. రానా ప్రతినాయకుడిగా నటిస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు ఉంటారని కూడా చెబుతున్నారు. అయితే చిత్రబృందం వీటిపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. వీఎఫ్ఎక్స్కి అధిక ప్రాధాన్యం ఇస్తున్న సినిమా ఇది. కేవలం గ్రాఫిక్స్ కోసమే ఆరు నెలల సమయం కేటాయించాల్సివస్తుందని సమాచారం. చిరంజీవి కెరీర్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా కూడా ఇదే కానుందట.