రచయితలు దర్శకులుగా మారడం, సూపర్ హిట్లు కొట్టడం చూస్తూనే ఉన్నాం. త్రివిక్రమ్ నుంచి కొరటాల వరకూ…. ఈ జాబితాలో ఉదాహరణలు చాలా కనిపిస్తాయి. ఇప్పుడో స్టార్ రైటర్ కూడా మెగా ఫోన్ పట్టుకోబోవడానికి ఉత్సాహం చూపిస్తున్నట్టు తెలిసింది. ఆయనెవరో కాదు.. బుర్రా సాయిమాధవ్. కృష్ణవందే జగద్గురుమ్, కంచె, గోపాల గోపాల, ఖైది నెం.150.. ఇలా చాలా సినిమాలకు తన కలం బలంతో వన్నె తెచ్చారు. గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రానికి శక్తిమంతమైన డైలాగులు రాశారాయన. ప్రస్తుతం సైరా, ఎన్టీఆర్, మహానటి చిత్రాలకు ఆయనే మాటలు అందిస్తున్నారు. త్వరలోనే సాయిమాధవ్ మెగాఫోన్ పట్టుకోనున్నారని తెలిసింది. గత కొంతకాలంగా సాయిమాధవ్‌కి ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. కానీ రైటర్‌గా బిజీగా ఉండడం వల్ల.. మెగాఫోన్ వైపు మనసు పెట్టలేకపోయారు. సైరా, ఎన్టీఆర్ సినిమాల పనులు పూర్తయ్యాక.. దర్శకుడిగా ఆయన ప్రయాణం ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఓ అగ్ర నిర్మాణ సంస్థ ఆయనతో సినిమా చేయడానికి ముందుకొచ్చిందని సమాచారం. మరి బుర్రా.. ఏ కథానాయకుడితో తన ప్రయాణం ప్రారంభిస్తారో చూడాలి.