దక్షిణాదిలో ఉన్న అత్యుత్తమ నటీమణుల్లో సాయిపల్లవి పేరు కచ్చితంగా చెప్పుకోవాల్సిందే. తాను ఏ పాత్ర పోషించినా దానికో విశిష్టత తీసుకొస్తుంది. కథానాయిక అంటే మూడు పాటలు, నాలుగు సన్నివేశాలు అనే పడికట్టు సూత్రాన్ని పక్కన పెట్టి, కథలో తనకూ ప్రాధాన్యం ఉండేలా చూసుకొంటుంది. అలాంటి కథల్నే ఎంచుకొంటుది. తన పాత్రకు ప్రాధాన్యం లేదని అనిపిస్తే, స్టార్ సినిమాల్ని సైతం పక్కన పెట్టిన సందర్భాలెన్నో? సాయి పల్లవి ఓ సినిమా ఒప్పుకొందంటే, ఆ సినిమాలో విషయం ఉందనే నిర్దారణకు వస్తారు అభిమానులు. సాయి పల్లవిపై ఉన్న నమ్మకం అలాంటిది.
నటిగా అత్యుత్తమ ప్రమాణాలు పాటించే సాయిపల్లవికి ఓ కల ఉంది. అది జాతీయ అవార్డు అందుకోవడం. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది సాయి పల్లవి. చాలా ఏళ్ల క్రితం సాయిపల్లవి అమ్మ తనకో చీర ఇచ్చిందట. పెళ్లి రోజున కట్టుకోవాలని చెప్పారట. అయితే సాయిపల్లవికి ఇంకా పెళ్లి కాలేదు. మరోవైపు నటిగా ప్రయాణం మొదలు పెట్టింది. జాతీయ అవార్డు అందుకొనేటప్పుడు అమ్మ ఇచ్చిన చీర కట్టుకొని ఆ వేడుకకు హాజరవుతానని ఆరోజే మాట ఇచ్చిందట సాయి పల్లవి. అప్పటి నుంచీ తాను ఆ రోజు కోసమే ఎదురుచూస్తోంది. ‘గార్గి’ చిత్రానికి సాయి పల్లవికి జాతీయ అవార్డు వస్తుందని ఆశించారు. కానీ అది జరగలేదు. ‘విరాటపర్వం’లో సాయి పల్లవి చక్కటి ప్రతిభ కనబరిచింది. ఇటీవల ‘అమరన్’లో అత్యుత్తమ నటన ప్రదర్శించింది. ఇప్పుడు ‘తండేల్’ సినిమా మొత్తాన్ని తానై నడిపించింది. ఈసారైనా సాయి పల్లవికి అవార్డు వస్తుందేమో చూడాలి. ఇప్పుడు కాకపోయినా, రాబోయే రోజుల్లో ఉత్తమ నటిగా సాయి పల్లవి పురస్కారం అందుకోవడం ఖాయం. ఆమెకు అంతటి ప్రతిభ, అర్హత ఉన్నాయి.