గ్లామర్ నాయిక అనే పిలుపు చాలా మామూలు అయిపోయిందిప్పుడు. పరిశ్రమలో అడుగుపెట్టే ప్రతీ అమ్మాయి లక్ష్యం.. అదే కాబట్టి – అందాల ఆరబోతే ప్రధాన ధ్యేయం అవుతోంది కాబట్టి… అలాంటి గ్లామర్ నాయికల సంఖ్య ఎక్కువవుతోంది. ‘ఈమె మంచి నటి’ అని పించుకోవడమే కష్టం. అలా తొలి అడుగులోనే ‘నటి’ అనిపించుకుంది సాయి పల్లవి. తను సెట్లో ఉంటే.. కథానాయకులు సైతం కంగారు పడుతుంటారు. ఫిదా, ఎంసీఏ చిత్రాల్లో నటిగా అలరించింది సాయి పల్లవి. ఇప్పుడు పడి పడి లేచె మనసులోనూ.. వైశాలి పాత్రలో మంచి మార్కులు కొట్టేసింది. ఈ సందర్భంగా సాయి పల్లవితో చిట్ చాట్ ఇది.
ఈవారం మీరు నటించిన ‘పడి పడి లేచె మనసు’, ‘మారి 2’ ఒకేసారి విడుదలయ్యాయి. డబుల్ బొనాంజా కొట్టేసినట్టేనా?
ఈ శుక్రవారం నాకు చాలా స్పెషల్. ఒకేసారి రెండు సినిమాలు విడుదల కావడం థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఈ రెండు సినిమాల ఫలితాలూ సంతృప్తిగానే ఉన్నాయి. ఇది వరకు చేయని పాత్రలు లభించడం నా సంతోషాన్ని రెట్టింపు చేసింది.
మీకు స్వతహాగా ప్రేమకథలంటే ఇష్టమా?
అలాఏం లేదు. ఫిదా ఓ ప్రేమకథ, ఇప్పుడు పడి పడి లేచె మనసు కూడా లవ్ స్టోరీనే. అందుకే అలా అనిపిస్తోందేమో. వరుసగా ప్రేమకథలే చేస్తున్నా కదా.. కొన్నాళ్ల పాటు వాటికి గ్యాప్ ఇస్తా.
వైశాలి పాత్రలకు ఎలాంటి స్పందన వస్తోంది?
ఈ పాత్ర అందరికీ బాగా నచ్చింది. మా అమ్మ నా సినిమా చూసినప్పుడల్లా ` నువ్వు ఇంట్లో ఎలా ఉన్నావో.. తెరపై కూడా అలానే కనిపిస్తున్నావు` అనేది. కానీ ఈ సినిమా చూశాక.. ‘నీలో నాకు నటి కనబడింది’ అని చెప్పింది. ఆ మాట చాలా సంతోషంగా అనిపించింది.
ఈ సినిమాలో శర్వానంద్‌తో మీ కెమిస్ట్రీ బాగా పండిందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. అందుకోసం మీరు చేసిన ప్రత్యేక కసరత్తు ఏమిటి?
ప్రేమకథలకు కెమిస్ట్రీ చాలా ముఖ్యం. అయితే అందుకోసం ప్రత్యేకంగా ఏం చేయలేదు. శర్వానంద్ సూర్య, నేను ‘వైశాలి’ అనుకుని నటించాం అంతే. ఎప్పుడైతే నటీనటులు కాకుండా పాత్రలు కనిపించాయో, అప్పుడే మా మధ్య కెమిస్ట్రీ పండినట్టు.
శర్వానంద్‌ని డామినేట్ చేశారని కూడా అంటున్నారు..
సినిమాల్లో ఒకర్నొకరు డామినేట్ చేయడం అంటూ ఏం ఉండదు. అలా చేస్తే మీరనుకున్న కెమిస్ట్రీ అస్సలు పండదు. శర్వా చాలా మంచి నటుడు. తన సహకారం మాటల్లో చెప్పలేనిది. నాకు తెలుగు అంతగా రాదు. కానీ.. సెట్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేయగలుగుతున్నానంటే అదంతా నా హీరోల వల్లే.
మీ రూపంలో టాలీవుడ్‌కి ఓ స్టార్ హీరోయిన్ దొరికినట్టు అనుకుంటున్నారంతా. మీరు ఆ మాటనమ్ముతారా?
స్టార్డమ్, డామినేషన్.. ఇలాంటి మాటలు వింటే భయమేస్తుంది. నటించడం అంటే నాకు ఇష్టం. మంచి పాత్రలు చేయాలనుకుంటాను. ఓ పాత్ర చేస్తే జనాలకు గుర్తిండిపోవాలని తపిస్తాను. అంతే తప్ప మరే విషయాలూ పట్టించుకోను. ఇప్పటికీ నేను ఇంట్లో సాధారణమైన అమ్మాయినే. ఇంట్లోవాళ్లు స్నేహితులు కూడా నన్ను ఓ హీరోయిన్గా చూడరు.
ముద్దు సీన్ల హడావుడి చాలా కనిపిస్తోందిప్పుడు.. మిమ్మల్ని కూడా అలాంటి సన్నివేశాల్లో నటించమని అడిగారా?
– నేను ముద్దు సన్నివేశాల్లో నటించను. చిట్టి పొట్టి దుస్తులు వేసుకోను. అలాగని నేను వాటికి వ్యతిరేకం కాదు. అందులో తప్పూ లేదు. కాకపోతే నాకు సౌకర్యంగా ఉండదంతే. బ్రాండింగ్ చేయడం, వ్యాపార ప్రకటనల్లో నటించడం నాకు ఇష్టం ఉండదు. నాకు కావాల్సిన డబ్బు సినిమాల్లో నటించడంతో వస్తుంది. మరో కొత్త మార్గాన్ని అన్వేషించడం నాకు ఇష్టం లేదు.