హీరోల్ని చూసి థియేటర్లకు వచ్చే రోజులు కావివి. కంటెంట్ నచ్చితేనే జనం టికెట్లు కొంటున్నారు. అలాంటిది ఓ హీరోయిన్ క్రౌడ్ పుల్లర్ గా మారింది. తన సినిమాతో జనాల్ని థియేటర్లకు రప్పిస్తోంది. ఆ హీరోయిన్ సాయి పల్లవి. ‘అమరన్’ చిత్రానికి వస్తున్న స్పందన వెనుక…సాయి పల్లవి మానియా స్పష్టంగా కనిపిస్తోంది. తమిళ నాట ఈ చిత్రం వసూళ్ల దుమ్ము దులుపుతోంది. తెలుగులోనూ స్ట్రయిట్ చిత్రాలకు సమానంగా వసూళ్లు అందుకొంటోంది. తమిళంలో శివ కార్తికేయన్ స్టార్ హీరోనే. కాకపోతే… అక్కడ శివ కార్తికేయన్ సినిమాలెప్పుడూ ఈ స్థాయి వసూళ్లు అందుకోలేదు. సాయి పల్లవి అక్కడ యాడింగ్ గ్లామర్ అయ్యింది. తెలుగులో అయితే ఇది సాయి పల్లవి సినిమాగానే చాలమణీ అవుతోంది. ఫ్యామిలీ ఆడియన్స్‌లో సాయి పల్లవికి ఉన్న క్రేజ్ వేరు. వాళ్లని మరోసారి అమరన్‌తో థియేటర్లకు రప్పించింది సాయి పల్లవి. మొన్నటి వరకూ `బాయ్ కాట్ సాయిపల్లవి` అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. అయినా కూడా… ఆ ప్రభావం `అమరన్`పై ఇసుమంత కూడా కనిపించలేదు. అప్పుడు సాయి పల్లవిని తిట్టిన నోళ్లే.. ఇప్పుడు సాయి పల్లవిని పొగడ్డం ప్రారంభించాయి.
తెలుగులో సాయి పల్లవి చేసిన సినిమా తండేల్. చిత్రబృందం కూడా సాయి పల్లవిపై గట్టి నమ్మకాలు పెట్టుకొంది. తండేల్ స్థాయిని, వసూళ్లనీ పెంచే స్థాయి సాయి పల్లవికి ఉందన్నది గీతా ఆర్ట్స్ నమ్మకం. అందుకే వేదికపై అల్లు అరవింద్ సాయిపల్లవి నామాన్నే జపించారు. తండేల్ లో సాయిపల్లవి పాత్రని సైతం దర్శకుడు చందూ మొండేటి ప్రత్యేక శ్రద్దతో తీర్చిదిద్దారు. ఈ సినిమాలోని కీలకమైన సెకండ్ ఆఫ్‌ని సాయిపల్లవి తన భుజాలపై వేసుకొని నడిపించిందని సమాచారం. హీరో పాత్ర కంటే.. హీరోయిన్ పాత్ర విస్కృతమయిన ఫీలింగ్ వచ్చినా, కథకు అది అవసరం కాబట్టి, చైతూ కూడా పెద్దగా ఇన్వాల్వ్ అవ్వలేదని తెలుస్తోంది. తండేల్ హిట్ కథైతే దాన్ని సూపర్ హిట్ చేసే బాధ్యత, తండేల్ సూపర్ హిట్ అయితే, దాన్ని రూ.100 కోట్ల సినిమాగా మార్చే బాధ్యత.. సాయి పల్లవిపైనే వేసేసింది చిత్రబృందం. అదీ.. సాయి పల్లవి మానియా మహత్తు!