‘బలగం’తో దర్శకుడిగా తన మార్క్ చూపించుకొన్నాడు వేణు. ఈ సినిమాతో జబర్దస్త్ వేణు కాస్త, ‘బలగం’ వేణు అయిపోయాడు. దిల్ రాజు బ్యానర్లో మరో సినిమా చేసే అవకాశం దక్కించుకొన్నాడు. ‘ఎల్లమ్మ’ అనే కథ రెడీ చేశాడు. హీరోగా నానిని అనుకొన్నారు. కానీ వర్కవుట్ కాలేదు. చివరికి నితిన్ ఫిక్సయ్యాడు. కథానాయికగా సాయి పల్లవి పేరు గట్టిగా వినిపించింది. వేణు కూడా సాయి పల్లవిని కలిసి, కథ చెప్పాడు. తనకూ బాగా నచ్చింది. నితిన్ – సాయి పల్లవి కాంబో కూడా ఫ్రెష్షుగా ఉంటుంది. కాబట్టి ఈ కాంబినేషన్ దాదాపు ఫిక్స్ అనుకొన్నారు.
అయితే ఇప్పుడు ఈ సినిమా సాయి పల్లవి చేయడం లేదని తెలిసింది. కథ నచ్చినా, డేట్లు సర్దుబాటు కాకపోవడం వల్ల సాయి పల్లవి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొందని టాక్. పైగా ఇటీవల సాయి పల్లవికి వరుస విజయాలు అందాయి. తన పారితోషికం కూడా పెంచేసింది. అంత పారితోషికం ఇస్తే, బడ్జెట్ పరంగా వర్కవుట్ అవ్వదు. అందుకే టీమ్ కూడా మరో కథానాయిక కోసం అన్వేషిస్తోంది. ‘ఎల్లమ్మ’ కథంతా హీరోయిన్ చుట్టూనే తిరుగుతుంది. కాబట్టి స్టార్డమ్ ఉన్న హీరోయినే కావాలి. సమంత, రష్మిక.. ఈ స్థాయి ఉన్న హీరోయిన్ని ఎంపిక చేయాలి. ప్రస్తుతం చిత్రబృందం కూడా ఈ విషయమై మల్లగుల్లాలు పడుతోందని టాక్. స్క్రిప్టు దాదాపుగా పూర్తయ్యింది. బుర్రా సాయిమాధవ్ సంభాషణలు అందిస్తున్నారు. హీరోయిన్ ఫిక్సయితే.. షూటింగ్ మొదలెట్టేస్తారు.