‘ఫిదా’ చూశాక దక్షిణాదికి మరో మంచి నటి వచ్చింది అని సంబరపడ్డారంతా! ‘ఎంసీఏ’లోనూ అదరగొట్టింది సాయి పల్లవి. కాకపోతే ‘ఫిదా’ చూసిన కళ్లతో ‘ఎంసీఏ’ చూస్తే సాయి పల్లవి ఆనదు. నిజానికి ప్రతిసారీ ‘ఫిదా’లో కథానాయిక పాత్రలా.. పటిష్టమైన పాత్రలు రావడం కష్టమే. ఈ విషయం సాయి పల్లవికీ అర్థమైంది. అందుకే క్రమంగా రూటు మారే పనిలో ఉంది. ”ఎప్పుడూ ఒకే తరహా పాత్రలు వస్తాయనుకోవడం అత్యాస అవుతుంది. ఎలాంటి పాత్రలో అయినా నెగ్గుకు రాగలనా, లేదా? అనేదే ముఖ్యం. నా వరకూ అదో ఛాలెంజ్” అంటోంది సాయి పల్లవి. తన మాటలు, ఆలోచనలు చూస్తుంటే… కమర్షియల్ హీరోయిన్గా ఎదగాలన్న తాపత్రయం కనిపిస్తుంది. నటిగా ఎంత పేరు తెచ్చుకున్నా, చేతిలో కమర్షియల్ సినిమాలు లేకపోతే… నెంబర్ వన్ రేసులో నిలబడలేం. ఈ విషయాన్ని సాయి పల్లవి కనిపెట్టేసింది.
”ఎంసీఏ లాంటి కథల్ని ఎంచుకోవడానికి కారణం ఒక్కటే… అదో కమర్షియల్ సినిమా. అలాంటి కథల్లోనూ ఇమడగలనో, లేదో తెలుసుకోవాలనిపించింది. అందుకే ఆ సినిమా ఒప్పుకున్నా. ఇక నుంచి కమర్షియల్ సినిమాలకు నా లైన్ క్లియర్ అయిపోయింది” అని మనసులో మాట చెప్పేసింది సాయి పల్లవి. అంటే.. సాయి పల్లవి రకుల్ ప్రీత్, రాశీఖన్నాలా కమర్షియల్ కథానాయిక అనిపించుకోవాలని చూస్తోందన్నమాట. మరి ఈ ఆలోచనలు ఆమెను ఎటు వైపుకు నడిపిస్తాయో…??